Begin typing your search above and press return to search.

ఈడీకి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని అంశాలేంటి?

By:  Tupaki Desk   |   17 March 2023 10:11 AM GMT
ఈడీకి ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖలోని అంశాలేంటి?
X
ఢిల్లీ లిక్కర్ స్కాంలో తమ విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాల్ని పక్కన పెట్టిన ఎమ్మెల్సీ కవిత.. విచారణపై తనకున్న అభ్యంతరాల్ని వ్యక్తం చేయటంతో పాటు.. తాను విచారణకు రాలేనని పేర్కొనటం తెలిసిందే. తాను సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమె ఒక లేఖను ఈడీ హెడ్డాఫీసులో దర్యాప్తు విభాగంలో పని చేసే అసిస్టెంట్ డైరెక్టర్ జోగిందర్ సింగ్ కు తన ప్రతినిధిగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న సోమా భరత్ కుమార్ చేత ఒక లేఖను పంపారు.

ఈ లేఖలోని ఆమె పలు అంశాల్ని ప్రస్తావించారు. మొత్తంగా చూస్తే.. లేఖలో పదహారు అంశాలు ఉన్నాయి. అందులో ఆమె పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఈడీ విచారణపై తనకున్న అభ్యంతరాలతో పాటు.. తనను ఏ రీతిలో విచారణ చేయాలన్న విషయాన్ని ఈడీ అధికారులకు తెలియజేసే ప్రయత్నం చేసినట్లుగా ఉండటం గమనార్హం. ఈడీ తీరును తప్పు పట్టటమే కాదు.. తాను వారి ఆదేశాల్ని ఏ రీతిలో మన్నించానన్న విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయటం విశేషం.

తాను చట్టం గురించి వివరించినప్పటికీ ఈడీ అధికారులు అంగీకరించకపోవటంతోనే తాను ఈ నెల 11న జరిగిన విచారణకు హాజరైనట్లు చెప్పిన కవిత.. తాజా విచారణకు హాజరు కానని స్పష్టం చేయటం గమనార్హం. ఇంతకీ లేఖలో ఏమని చెప్పారు? అందులో పేర్కొన్న అంశాలు ఏమిటి? అన్నది చూస్తే..

- ఈడీ నాకు 2023 మార్చి 7న సమన్లు పంపారు. నేను మహిళను కాబట్టి, చట్ట ప్రకారం నన్ను డైరెక్టరేట్‌ ఆఫీసుకు పిలవకూడదు. ఆడియో, వీడియో ద్వారా జరిగే విచారణకు నేను సిద్దం. నా ఇంటికి కూడా వచ్చి విచారణ జరిపించవచ్చని పేర్కొన్నా. అయినప్పటికీ మీరు అందుకు నిరాకరించారు. ముఖాముఖి విచారణ జరగాల్సిందేనని పట్టుబట్టారు.

- నేను చట్టాన్ని వివరించా. అయినా.. మీరు అంగీకరించకపోవటంతో దర్యాప్తునకు సహకరించాలన్న ఉద్దేశంతో మార్చి 11న విచారణకు హాజరయ్యా. ఈ విచారణ సందర్భంగా నాకు తెలిసినంత వరకు దర్యాప్తునకు సహకరించానన్న విషయంలో ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత సమాచారాన్ని ఇచ్చా.

- అయినా.. మీరు నా మొబైల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్ తేవాలని మీరు ఎక్కడా చెప్పకున్నా.. నా చేతిలో ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. మీరు ఆరోపిస్తున్న నేరానికి.. నా ఫోన్ కు ఏం సంబంధమో చెప్పలేదు.

- మనీలాండరింగ్ నిరోధక చట్టం సెక్షన్ 50(5) కింద అలాంటి అధికారం ఉందని మీరు చెప్పారు. నేను తీసుకున్న న్యాయ సలహా ప్రకారం అది చట్ట వ్యతిరేకం. పైగా ఫోన్ లో ఉన్న అంశాలు నా ప్రైవసీ హక్కుకు సంబంధించినవి.

- సాయంత్రం (సూర్యాస్తమయం) తర్వాత కూడా నన్ను కూర్చబెట్టారు. రాత్రి 8.30 గంటల వరకు ఉంచి, చివరకు 16న మళ్లీ రావాలని సమన్లు చేతికి అందించారు. సమన్లు చూస్తే.. ఎక్కడా వ్యక్తిగతంగా లేదా ప్రతినిధిని పంపడం ద్వారా హాజరు కావాలని చెప్పలేదు. అందుకే నేను నా తరఫున బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సోమా భరత్ కుమార్ ను నా ప్రతినిధిగా పంపుతున్నాను.

- గతంలో మాదిరి దర్యాప్తునకు సహకరించేందుకు నేను ఎప్పుడైనా సిద్ధమే. అన్ని పరిస్థితుల్లోనూ మీరు చట్టానికి కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది.

- అరెస్టు అయిన ఒక నిందితుడితో ముఖాముఖి విచారణ జరిపిస్తామన్న పేరుతో నన్ను మార్చి 11న పిలిపించినప్పటికీ ఎవరినీ నా ముందు ప్రవేశ పెట్టకపోవటం అన్నింటికి మించిన దిగ్భ్రాంతికరం. అదేమని అడిగితే ప్లాన్ మార్చినట్లు భానుప్రియ మీనా అనే అధికారి తెలిపారు.

- దర్యాప్తు పవిత్రమైన న్యాయ సూత్రాల ప్రకారం జరగటం లేదు. స్వేచ్ఛగా.. సజావుగా నిష్పక్షపాతంగా జరగటం లేదన్న అనుమానాలు కలుగుతున్నాయి. రాజ్యాంగపరంగా నా ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని భావించి, నేను ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టును ఆశ్రయించాను.

- అందులో నాకు ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని.. విచారణను ఆడియో, వీడియో ద్వారా లాయర్ల సమక్షంలో.. సీసీ కెమేరాల పర్యవేక్షణలో.. స్పష్టమైన దూరాన్ని పాటించి జరిపించాలని సుప్రీంకోర్టును కోరాను.

- నా మొబైల్ ఫోన్ ను స్వాధీన పర్చుకోవటం చట్టవిరుద్ధమని ప్రకటించాలని కోరాను. మమిళను కార్యాలయానికి పిలిపించి విచారణ జరిపే విషయంలో 2018లో దాఖలైన పిటిషన్ తో పాటు నా పిటిషన్ ను విచారించాలని కోరారు.

- నాపై బలవంతంగా ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుకోవాలని.. సమన్లపై స్టే విధించాలని, మొబైల్ ఫోన్ స్వాధీనపర్చుకునేందుకు జారీ చేసిన ఆదేశాల్ని నిలిపివేయాలని కూడా కోర్టును కోరాను.

- నా పిటిషన్ ను ప్రస్తావించినప్పుడు మార్చి 24న లిస్టు చేయాలని ఆదేశించారు. అందుకే సుప్రీంకోర్టులో నా పిటిషన్ విచారించి తేల్చేంతవరకు వేచి చూడాలని నేను కోరుతున్నాను. నేను నా జీవితం మొత్తం సమాజం కోసం అంకితం చేశాను. ఎప్పుడూ చట్టానికి కట్టుబడి ఉంటాను. ఈ దేశపు మహిళా నేతగా.. పౌరురాలిగా మహిళల హక్కుకు సంబంధించి అమలులో ఉన్న చట్టానికి వ్యతిరేకంగా చర్యలు తీసుకోకుండా చూడటం నా విధి.

- ఒక చట్టసభ ప్రతినిధిని అయిన నా హక్కులనే ఉల్లంఘించినప్పుడు న్యాయపాలన అమలు అయ్యేలా మాత్రమే కాదు.. చట్టాన్ని ఏ ఏజెన్సీ ఉల్లంఘించకుండా అన్ని చర్యలు తీసుకోవటం నా బాధ్యత. అందువల్ల మీ విచారణను సుప్రీంకోర్టు విచారణ పూర్తి అయ్యే వరకు నిలిపివేయాల్సిందిగా నేను మరోసారి అభ్యర్థిస్తున్నా.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.