Begin typing your search above and press return to search.

'మూడు'తో మూడ్ మారింది.. అందుకే ఓట్లు వేసేందుకు ధైర్యం చేశారా?

By:  Tupaki Desk   |   24 March 2023 6:00 PM GMT
మూడుతో మూడ్ మారింది.. అందుకే ఓట్లు వేసేందుకు ధైర్యం చేశారా?
X
అందుకే అంటారు అధికారం చేతిలో ఉందని తప్పులు చేస్తే.. అందుకు చెల్లించాల్సిన మూల్యం అంతకు మించిన రీతిలో ఉంటుందని. సంచలన విజయాన్ని సొంతం చేసుకొని 2019లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్.. తన మాటలతో.. చేతలతో వ్యవహరించిన తీరు తాజా పరిస్థితికి కారణమని చెప్పాలి. తనకు తిరుగులేదన్నట్లుగా ఉన్న ఆయన.. వైనాట్ 175 అన్న మాటను అనేశారు.

ఒకప్పుడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన వైఎస్ జగన్.. తన ఔదార్యంతోనే ప్రతిపక్ష నేతగా చంద్రబాబు కూర్చున్నారని.. తాను కానీ తలుపులు తెరిస్తే.. ప్రతిపక్షం ఉనికి కూడా ఉండేది కాదని.. ఆయన అదే పనిగా చెప్పుకొని.. తన గొప్పతనాన్ని తనకు తానుగా కీర్తించుకోవటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పటికి వైరల్ అవుతుంటాయి. మరి..అలాంటి జగన్ ఈ రోజున ఇలాంటి పరిస్థితి ఎందుకు ఎదురైంది? అన్నది ప్రశ్నగా మారింది.

తిరుగులేని అధికారం చేతిలో ఉన్నప్పటికి అహంకారం.. అహంభావంతో పాటు.. ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకోవటం.. మితిమీరిన ఆత్మవిశ్వాసం జగన్ కొంప ముంచాయిని చెప్పాలి. రాజకీయ ప్రత్యర్థుల్ని నిర్వీర్యం చేయటం కోసం.. వారిని బలహీన పర్చటం పైనే ఎక్కువ ఫోకస్ పెట్టిన జగన్.. రాష్ట్రాన్ని డెవలప్ చేయాలన్న అసలు విషయాన్ని మర్చిపోయారు. తాము అమలు చేసే సంక్షేమ పథకాలతో ఓట్లు రాలతాయని భావించే ఆయన తీరుపై ప్రజల్లో పెరిగిన ఆగ్రహానికి నిదర్శనంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి.

ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోవాలంటే.. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా తెలుగుదేశం పార్టీలో ఎవరికి లేని పరిస్థితి. దీనికితోడు.. అధికార పార్టీ జోరుకు బ్రేకులు వేసే శక్తి సామర్థ్యాలు తమ వద్ద లేవని చేతులు ఎత్తేసిన వేళలో.. ప్రజలు చైతన్యంతో ముందుకు వచ్చి ఎవరికి వారుగా వేసిన ఓట్ల ఫలితంగా మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో సంచలన విజయం సాధించిన పరిస్థితి. ఈ మూడు ఎన్నికల విజయం రాష్ట్ర రాజకీయ మూడ్ ను మార్చేలా చేసిందని చెప్పాలి.

ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత నేపథ్యంలో తాము ప్రాతినిధ్యం వహిస్తున్న అధికార పార్టీ అధినేత మీద ఉన్న ఆగ్రహాన్ని ఆత్మప్రభోదానుసారం ఓటు వేసేందుకు వైసీపీ ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారని చెప్పాలి. నిజానికి మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితం సానుకూలంగా రాకుంటే.. ఇలాంటి పరిస్థితి ఏర్పడేది కాదన్న మాట వినిపిస్తోంది. మూడింటిలో గెలిచిన గెలుపు.. కొత్త నమ్మకాన్ని.. ధీమాను కలుగచేశాయనిచెప్పక తప్పదు. అదే.. మూడ్ మొత్తం మారిపోయేలా చేసిందన్న మాట బలంగా వినిపిస్తోంది. అందుకే అంటారు.. ఎంత పెద్ద ఓడ అయినా చిన్న రంధ్రంతో మొదలయ్యే ఇబ్బంది.. తర్వాతి కాలంలో అంత పెద్ద ఓడను ముంచేస్తుందన్నట్లుగా.. వైసీపీ తాజా పరిస్థితి మీద జగన్ పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మరేం జరుగుతుందో చూడాలి.