విరాళాలు తెస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు!

Thu Jan 20 2022 19:00:01 GMT+0530 (India Standard Time)

MLA seat in the upcoming elections if donations are made!

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. రోజూవారీ ప్రభుత్వ వ్యవహారాలు కూడా నడవడం కష్టంగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు పింఛన్లకు అప్పు చేయాల్సినే పరిస్థితి ఉంది. మరోవైపు సీఎం జగన్ మాత్రం నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా డబ్బులు ఖాతాల్లో వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి అభివృద్ధి పూర్తిగా గాడి తప్పిందనే రాజకీయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు నిధులు లేవని వైసీపీ పార్టీ నాయకులే బహిరంగంగా నిస్సహాయతను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఏపీలో వివిధ అభివృద్ధి పనుల కోసం విరాళాలు సేకరించే బాధ్యతను ఎమ్మెల్యేలపై మోపాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యేల మధ్య చిచ్చు పెడుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వానికి ఇంకా ఎక్కువగా అప్పులు వచ్చే అవకాశం సన్నగిల్లుతోంది. దీంతో పాఠశాల భవనాల కోసం విదేశీ విరాళాలు తీసుకుని వస్తే వాటిని నిర్మించవచ్చని ప్రభుత్వం అనుకుంటుందని సమాచారం. కానీ ఇటీవల కేంద్ర ప్రభుత్వం పలు స్వచ్ఛంద సంస్థలకు విదేశీ విరాళాలు స్వీకరించే విషయంలో కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆ మార్గంలో విరాళాలు వచ్చే పరిస్థితి లేకపోవచ్చు. అందుకే ఎమ్మెల్యేలకు ఇంత చొప్పున విరాళాలు సేకరించాలని టార్గెట్ పెడితే ఎలా ఉంటుందని ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది.

వ్యక్తిగతంగా విరాళాలు సేకరించడంలో ఎలాంటి ఇబ్బంది ఉండదని ఎమ్మెల్యేలకు ఆ బాధ్యత కట్టబెట్టాలని జగన్ ప్రభుత్వం అనుకుంటోంది. ఇలా ఎక్కువ విరాళాలు తెస్తేనే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఇస్తామని కండిషన్ పెడితే డబ్బులు వస్తాయని భావిస్తుందని సమాచారం. గతంలో యూపీలో ఫేస్బుక్లో ఎక్కువ మంది అనుచరులు ఉన్నవాళ్లకు బీజేపీ ఎమ్మెల్యే సీట్లు ఇచ్చింది. ఇప్పుడు ఏపీలో అత్యధిక విరాళాలు తీసుకు వస్తే వైసీపీ ఎమ్మెల్యే సీటు ఇస్తానంటోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విరాళాలు తెస్తేనే సీటు గ్యారెంటీ అని కండీషన్ పెడితేనే వాళ్లు నిధులు సేకరిస్తారని కొంతమంది ప్రభుత్వానికి ఉచిత సలహాలు ఇచ్చారంటా. ఇప్పుడది ఎమ్మెల్యేలకు తంట తెచ్చిపెట్టనుందనే మాటలు వినిపిస్తున్నాయి.