Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. న‌రికేయాల‌ని పిలుపు

By:  Tupaki Desk   |   25 Jun 2022 1:27 PM GMT
చంద్ర‌బాబుపై తీవ్ర స్థాయిలో నోరు పారేసుకున్న వైసీపీ ఎమ్మెల్యే.. న‌రికేయాల‌ని పిలుపు
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై వైసీపీ నాయ‌కులు నోరు పారేసుకునే సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఎక్క‌డిక‌క్క‌డ చాలా మంది నాయ‌కులు అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు చేస్తుంటారు. నువ్వు-నువ్వు- అని కూడా సంబోధిస్తుంటారు.

ఇక‌, మాజీ మంత్రి కొడాలి అయితే.. మ‌రింత దూకుడు ప్ర‌ద‌ర్శిస్తారు. అయితే.. ఎంతో కొంత వివాదాల‌కు దూరంగా ఉండే.. అర‌కు ఎమ్మెల్యే చెట్టి ఫ‌ల్గుణ కూడా.. ఇప్పుడు నోరు పారేసుకోవ‌డం గ‌మ‌నార్హం. గ‌తంలో బ్యాంకు మేనేజ‌ర్ ఉద్యోగం చేసిన‌.. ఫ‌ల్గుణ‌.. వైసీపీ ద్వారా రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. వివాద ర‌హితుడుగా పేరుతెచ్చుకున్నారు.

అయితే.. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు చంద్ర‌బాబుపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబును కొట్టండి.. కుదిరితే.. ధైర్యం ఉంటే.. న‌రికేయండి! అంటూ.. గిరిజ‌నుల‌ను రెచ్చ‌గొట్టారు. ప్ర‌స్తుతం ఈ వివాదం రాజ‌కీయ వ‌ర్గాల్లో కాక రేపుతోంది. ఏం జ‌రిగిందంటే.. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం కామయ్యపేట పంచాయతీ కేంద్రంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అరకు ఎమ్మెల్యే, మాజీ బ్యాంకు ఉద్యోగి ఫ‌ల్గుణకు ఆ పంచాయతీ పరిధిలోని గిరిజనులు సమస్యలు ఏకరువుపెట్టారు. తమ ప్రాంతాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని.. రహదారులు, మంచినీటి, మౌలిక సదుపాయాలు లేక అల్లాడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు స్పందిస్తూ.. రహదారులు మంజూరు అయినప్పటికీ నిధులు లేకపోవడంతో నిలిచిపోయాయ ని చెప్పారు. కొత్త రాష్ట్రం కాబట్టి నిధులు లేవని చెప్పారు. అయినా.. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కదా అంటూ.. ఎంపీపీ, జడ్సీటీసీ సభ్యులు చెప్పడంతో.. గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పంచాయ తీని దత్తత తీసుకొని.. మూడేళ్ల పాలనలో ఏమి చేశారంటూ నిలదీశారు. గిరిజనులు ఇలా ప్రశ్నల వర్షం కురిపించడంతో.. ఎమ్మెల్యేలో ఆవేశం క‌ట్ట‌లు తెంచుకుంది.

“సమస్యలు చెప్పండి కానీ.. ప్రభుత్వాన్ని ప్రశ్నించవద్దు” అన్నారు ఎమ్మెల్యే. ఈ మాటలకు స్థానికులు మరింత మండిపడడంతో.. అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే ఓ మహిళ ఇల్లు లేదని ప్రశ్నించగా.. “ఇళ్ల నిర్మాణాలపై చంద్రబాబు నాయుడు కోర్టులో కేసు వేయడం వల్ల నిలిచిపోయాయి.. కాబట్టి వారినే ప్రశ్నించండి, తిర‌గ‌బ‌డి కొట్టండి, ధైర్యం ఉంటే న‌రకండి” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.