లగ్జరీ కార్ల స్కామ్: హైదరాబాద్ లోని ప్రముఖుల మెడకు ఉచ్చు

Thu Jul 22 2021 08:00:01 GMT+0530 (IST)

Luxury Car Scam busted officials digging deeper to get more information

విదేశీ రాయబారుల పేరుతో ఖరీదైన కార్లను దిగుమతి చేసుకొని పన్నులు ఎగ్గొడుతున్న వ్యవహారంపై ముంబై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు ‘ఆపరేషన్ మాంటేకార్లో’ పేరుతో దర్యాప్తు కొనసాగుతున్నారు.ఈ కుంభకోణంలో హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖులతో సంబంధాలు బయటపడుతున్నాయి. డీఆర్ఐ అధికారుల సమాచారం ప్రకారం.. సోమవారం మలక్ పేట ప్రాంతంలో ఖరీదైన ‘నిస్సాన్ పెట్రోల్’ కారును స్వాధీనం చేసుకున్నారు. ఓ స్థిరాస్తి వ్యాపారి దీన్ని కొనుగోలు చేసినట్లు గుర్తించారు.

హైదరాబాద్ నగరానికి చెందిన చాలా మంది ముంబై ముఠా నుంచి కార్లు కొనుగోలు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.  గడిచిన ఐదేళ్లలో ముంబై పోర్టుకు దిగుమతి అయిన 50 వరకూ కార్లలో చాలా మట్టుకు హైదరాబాద్ లో అమ్మారని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. కనీసం రూ.కోటిపైనే ధర ఉండే కార్లను ఎక్కువగా రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు సినీ తారలు కొనుగోలు చేస్తుంటారు. ఎవరెవరు కొనుగోలు చేశారో గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వారిపై కూడా కేసులు నమోదు చేయనున్నారు.

విదేశాల నుంచి తెప్పించే విలాసవంతమైన కార్లకు భారీగా పన్నులు చెల్లించాల్సిఉంటుంది. విలువపై 204శాతం దిగుమతి సుంకం కింద చెల్లించాలి.  అయితే దేశంలోని విదేశీ రాయబారులకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు.

గురుగావ్ లోని ఓ ఖరీదైన కార్ల విక్రయ సంస్థ సీఈవో లియాకత్ బచావ్ ఖాన్ తోపాటు నిపుణ్ మిగ్లానీ సురియా అర్జునన్ లు ఈ కుంభకోణానికి తెరతీశారు. రాయబారుల పేరు మీద ఓ కారు వస్తోందన్న పక్కా సమాచారంతో ముంబై పోర్టులో మాటు వేశారు. వారు ఊహించినట్టే దిగుమతి అయిన కారును ముంబైలోని అంధేరిలో ఉన్న కార్ల షోరూంకు తరలించి అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు అమ్మారు. ఏడాది కాలంలో దాదాపు 20 కార్లు తెప్పించి ఇలాగే విక్రయించినట్టు డీఆర్ఐ అధికారులు గుర్తించారు. ఈ వాహనాలకు మణిపూర్ లోని మారుమూల ప్రాంతాల్లో ఉన్న రవాణాశాఖ కార్యాలయాల్లో దళారుల్లో రిజిస్ట్రేషన్ చేయించారు.