ప్రియుడ్ని బాంబర్ గా పేర్కొన్నలవ్వర్.. 6 గంటలు ఆగిన ఫ్లైట్

Tue Aug 16 2022 10:33:36 GMT+0530 (IST)

Lover called girlfriend Bomber in chatting Flight stopped for 6 hours

అసలేమైనా సంబంధం ఉందా? లవ్వర్ తన ప్రియుడ్ని బాంబర్ గా చాటింగ్ లో పేర్కొంటే.. విమానం ఆరు గంటలు ఎందుకు ఆగుతుంది? లింకు లేనట్లు ఈ మాటలేంది? అన్న ఆగ్రహం అక్కర్లేదు. విషయం మొత్తం తెలిస్తే అవాక్కు కావటమే కాదు.. ఇలా జరిగిందా? అన్న విస్మయానికి గురి కాక తప్పదు. మన పని మనం చేసుకుంటున్నా.. మన పక్కనుండే కొందరు మాత్రం తమ పనుల్ని ఆపేసి మరీ.. పక్కనోళ్ల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. ఇలాంటోళ్లకు పనేం లేదా? అని విసుక్కుంటూ ఉంటాం. అలాంటి దరిద్రపుగొట్టు అలవాటే తాజా ఉదంతానికి కారణంగా చెప్పాలి.మంగళూరు నుంచి ముంబయి వెళుతున్న ఇండిగో విమానం ఆరు గంటల పాటు ఆగిపోవటానికి కారణమైన ఉదంతం గురించి తెలిస్తే నోట మాట రాదు కదా? ఇలా కూడా జరిగిందా? అంటూ విస్మయానికి గురి కాక తప్పదు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
ఆదివారం మంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చాడు ఒక యువకుడు. అతడేమో ముంబయి వెళుతుంటే.. అతగాడి ప్రియురాలు బెంగళూరు వెళ్లాల్సి ఉంది. అలా వచ్చిన వారిద్దరు ఎవరి టికెట్లు వారు తీసుకొని తమ ప్రయాణాలు మొదలుపెట్టారు. యువకుడి విమానం రావటంతో ముంబయికి వెళ్లే ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు ఫోన్లో చాటింగ్ చేసుకున్నారు.

ఈ సందర్భంగా విమానాల్లో భద్రత గురించి వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ.. ''నువ్వే ఒక బాంబర్'' అంటూ ప్రియురాలు ప్రియుడికి మెసేజ్ చేసింది. ఆమె పంపిన మెసేజ్ చూసిన యువకుడు సరదాగా నవ్వుకున్నాడు. విషయం ఇక్కడితో ఉంటే.. అసలు ఈ విషయమే బయటకు వచ్చేది కాదు. అనుకోకుండా.. అతడి చాటింగ్ ను అతడి వెనుక సీట్లో ఉన్న ఒక ప్రయాణికురాలి కంట్లో పడింది.

దీంతో ఆమె భయాందోళనకు గురై.. ఆ విషయాన్ని ఆమె విమాన సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ను అప్రమత్తంగా చేశారు. దీంతో టేకాఫ్ తీసుకోవాల్సిన విమానం ఆగింది. అందులోకి ఇదంతా ఆగస్టు 15న చోటు చేసుకోవటంతో.. అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించి.. విమాన సిబ్బందిని.. ప్రయాణికుల్ని అందరిని దించేసి పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. అయితే.. ఎక్కడా ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదు.

దీంతో.. చాటింగ్ చేసిన ప్రియుడ్ని.. ప్రియురాలిని పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. అదంతా కూడా సరదా సంభాషణే అన్న విషయాన్ని నిర్దారణ చేసుకున్న తర్వాత.. ఆరు గంటల ఆలస్యంగా విమానాన్ని టేకాఫ్ తీసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ప్రియుడి విమానం ఆగిపోవటం.. ఆరు గంటల ఆలస్యంగా బయలుదేరటంతో అతను ఆ విమానంలో వెళ్లిపోగా.. ప్రియురాలు మాత్రం.. ఆమె ఎక్కాల్సిన విమానం వెళ్లిపోవటంతో ఆమె ప్రయాణించటానికి వీల్లేకుండా పోయింది. ఈ ఇద్దరిది ఫ్రెండ్లీ చాటింగ్ అని తేలటం.. దీనికి సంబంధించి అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు రాకపోవటంతో కేసు నమోదు కాలేదు. అందుకే.. కొన్ని సందర్భాల్లో.. కొన్ని ప్రాంతాల్లో సరదాగా అనే మాటలు కూడా ఈ తరహా ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. ఈ విషయంలో కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్పక తప్పదు.