Begin typing your search above and press return to search.

పెరగనున్న లోక్‌ సభ సీట్లు.. దక్షిణాదికి నష్టమేనా?

By:  Tupaki Desk   |   30 May 2023 2:12 PM GMT
పెరగనున్న లోక్‌ సభ సీట్లు.. దక్షిణాదికి నష్టమేనా?
X
ప్రస్తుతం పార్లమెంటులో రెండు సభలు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో దిగువ సభ అయిన లోక్‌ సభలో 545 మంది సభ్యులు ఉంటారు. వీరిలో 543 మందిని దేశ ప్రజలు ఎన్నుకుంటారు. మిగిలిన ఇద్దరిని రాష్ట్రపతి.. ఆంగ్లో–ఇండియన్ల నుంచి ఎంపిక చేస్తారనే విషయం తెలిసిందే. చివరిసారిగా మనదేశంలో 1973లో లోక్‌ సభ సీట్ల సంఖ్యను పెంచారు. ఆ సమయంలో 524 నుంచి 545కి లోక్‌ సభ సీట్లు పెరిగాయి. ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించారు. 31వ రాజ్యాంగ సవరణ ద్వారా సీట్ల సంఖ్యను పెంచారు. ఇక 1976లో తదుపరి 25 ఏళ్లపాటు లోక్‌ సభ సీట్లను పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 2001లో మరో 25 ఏళ్ల పాటు లోక్‌ సభ సభ్యుల సంఖ్యలో మార్పులు చేయకూడదని నిర్ణయించారు.

2001లో తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పూర్తి కావొస్తోంది. మరోవైపు భారత్‌ జనాభా విపరీతంగా పెరిగింది. కొన్ని రాష్ట్రాలు జనాభా భారీగా పెరగ్గా,, మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా తగ్గిపోయింది. ముఖ్యంగా భారత్‌ ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంగా రికార్డు సృష్టించింది. ఈ క్రమంలో చైనాను అధిగమించింది.

ఈ నేపథ్యంలో లోక్‌ సభ సభ్యుల సంఖ్యను పెంచాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇటీవల కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రసంగించిన ప్రధాని మోదీ లోక్‌ సభ సభ్యుల పెంపుపై నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. దీంతో లోక్‌ సభ సభ్యుల పెంపు ఖాయమనే అంచనాలు వెలువడుతున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం లోక్‌ సభలో ఉన్న 545 మంది సభ్యుల సంఖ్యను 848కి చేర్చాలనే ప్రతిపాదనలు ఉన్నాయి. కొత్త పార్లమెంటు భవనాన్ని కూడా ఈ సంఖ్య కంటే కాస్త ఎక్కువగా 888 మంది కూర్చోవడానికి వీలుగా సిద్ధం చేయడం గమనార్హం.

ఈ నేపథ్యంలో లోక్‌ సభలో సీట్ల సంఖ్యను పెంచడానికి కొత్త డీలిమిటేషన్‌ కమిషన్‌ ను ఏర్పాటు చేయడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని సమాచారం. ఇప్పుడు 2026లో కొత్త డీలిమిటేషన్‌ కమిషన్‌ రావాల్సి ఉంది. కొత్త కమిషన్‌ ఏర్పాటు త్వరలో ప్రారంభమవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి.

అయితే కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసి తమ జనాభాను అదుపులో ఉంచుకున్న రాష్ట్రాలు సీట్ల పునర్విభజనలో నష్టపోకుండా చూసుకోవడం ప్రభుత్వం ముందున్న సవాలు. ఇందుకోసం రాష్ట్రాల మధ్య సీట్ల పునర్విభజన కోసం కొత్త ఫార్ములాను రూపొందించే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 81ని ప్రభుత్వం సవరించాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.

ప్రస్తుత జనాభా ప్రకారం, పాత ఫార్ములా ప్రకారం సీట్లను పంచినట్లయితే, లోక్‌సభ స్థానాల సంఖ్య 848కి పెరుగుతుంది. దీంతో ఉత్తరప్రదేశ్‌ లో ఇప్పుడున్న 80 సీట్లు ఏకంగా 143 సీట్లు అవుతాయి. కేరళలో మాత్రం ఇప్పుడు ఉన్నట్టే 20 స్థానాలు ఉంటాయి. రాష్ట్రాల జనాభా ఆధారంగా లోక్‌ సభ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తరప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో సీట్లు భారీగా పెరగనున్నాయి.

ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు జనాభా నియంత్రణ కార్యక్రమాలను క్రమం తప్పకుండా పాటిస్తూ జనాభాను భారీగా తగ్గించుకున్న దక్షిణ భారత రాష్ట్రాలు నష్టపోతాయని అంటున్నారు. దేశ మొత్తం జనాభాలో దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ రాష్ట్రాల జనాభా కేవలం 18 శాతమేనని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న లోక్‌ సభ సీట్లు కూడా తగ్గిపోతాయని.. ఈ తగ్గే సీట్లు జనాభా ఎక్కువ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయని చెబుతున్నారు.

దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోయి భారీ నష్టం చేకూరుతుందని అంటున్నారు. ఉత్తరాది నేతల పెత్తనం దక్షిణాదిపై పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తమవుతుంది. బలవంతంగా ఉత్తరాది సంస్కృతిని.. ముఖ్యంగా హిందీని బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దడం చేస్తారని అంటున్నారు. అలాగే ఉత్తరాది సంస్కృతి, సంప్రదాయాలను బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దుతారనే ఆందోళనలు ఉన్నాయి. ఇక అన్నింటికంటే ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమాల అమలులో ఈ వివక్ష తీవ్ర స్థాయిలో ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.