కరోనా తీవ్రత తగ్గించేందుకు లాక్డౌన్ పొడగింపు.. మెట్రో సేవలు బంద్

Sun May 09 2021 16:00:01 GMT+0530 (IST)

Lockdown extension to reduce corona intensity

దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకూ విరుచుకుపడుతోంది. నాలుగు రోజులుగా 4 లక్షలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ అమలులో ఉంది. కరోనాను కట్టడి చేయడానికి ఇతర మార్గాలు లేక చివరి అస్త్రంగా లాక్డౌన్నే ప్రయోగిస్తున్నాయి. దీనివల్ల పాజిటివ్ రేటు కాస్త తగ్గుతోందని ఆయా ప్రభుత్వాలు ప్రకటించాయి. మరికొన్నాళ్ల పాటు లాక్డౌన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశాయి.దేశ రాజధానిలో లాక్డౌన్ పొడగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 10 నుంచి మెట్రో సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. లాక్డౌన్ తో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందని ఆయన తెలిపారు. పాజిటివిటీ శాతం 35 నుంచి 23కు పడిపోయిందని చెప్పారు. అందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు పేర్కొన్నారు. మే17 వరకు లాక్డౌన్ పొడగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అక్కడ ఆక్సిజన్ కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం చురుగ్గా సాగుతోందని అన్నారు.

ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెండు సార్లు లాక్డౌన్ పొడగించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం... మరికొన్నాళ్లు అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది. మే 17 వరకు లాక్డౌన్ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ను కట్టడి చేయడానికి వేరే మార్గం లేక లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర సర్కార్ వెల్లడించింది.

దేశంలో పెద్ద రాష్ట్రాల్లో ఇప్పటికే లాక్డౌన్ అమల్లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనూ కఠిన ఆంక్షలు అమలుచేస్తున్నారు. తెలంగాణలో రాత్రి కర్ఫ్యూను పొడగిస్తూ ఇటీవలె సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పగలు కర్ఫ్యూను ప్రకటించింది. ప్రస్తుతం 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ అమల్లో ఉంది. ఫలితంగా వైరస్ తీవ్రత కొంతవరకు తగ్గిందని ఆయా ప్రభుత్వాలు అభిప్రాయపడుతున్నాయి.