Begin typing your search above and press return to search.

మళ్లీ లాక్ డౌన్ ఉండబోతుందా?

By:  Tupaki Desk   |   27 Jun 2020 11:30 AM GMT
మళ్లీ లాక్ డౌన్ ఉండబోతుందా?
X
కరోనా కేసులు వందల్లో ఉన్నప్పుడు దేశ ప్రధాని మోడీ లాక్ డౌన్ విధించారు. వలస కార్మికులను కట్టిపడేశాడు. ఎవరినీ బయటకు రానీయకుండా పోలీసులతో కొరఢా ఝలిపించారు. లాక్ డౌన్ వేళ వందల్లోనే ఉన్న కేసులు ఇప్పుడు సడలింపులతో జూలు విదులుస్తున్నాయి. కేసులు పెరగని మొదట్లో లాక్ డౌన్ విధించిన మోడీ.. ఇప్పుడు జెట్ స్పీడుతో పెరుగుతున్న వేళ నిస్సహాయంగా చూస్తూ ఉండడం దేశ ప్రజల్లో చర్చనీయాంశమవుతోంది. అప్పుడు పెట్టకుండా ఇప్పుడే కేసులు బాగా పెరుగుతున్న వేళ లాక్ డౌన్ పెడితే బాగుండేది కదా అని అందరూ ప్రశ్నిస్తున్నారు.

అయితే కేంద్రం మరోసారి లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టుగా పరిణామాలు తాజాగా చోటుచేసుకున్నాయి. దేశంలో తాజాగా రైల్వేశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ నెలాఖరు వరకూ మాత్రమే రైళ్లను నడుపుతామని, ఆపై జూలై 1 నుంచి ఆగస్టు 12 వరకూ సాధారణ రైళ్లను నడపబోమని రైల్వే శాఖ ప్రకటించింది. 43 రోజుల పాటు ఇప్పటికే బుక్ చేసుకున్న టికెట్లన్నీ క్యాన్సిల్ అయినట్టేనని రైల్వే శాఖ స్పష్టం చేసింది. ముందస్తు బుకింగ్స్ చేసుకున్న వారి డబ్బులను వారి ఖాతాల్లోకే జమ చేస్తామని కూడా ప్రకటించింది. ఈ ప్రకటనతో కేంద్రం మరోసారి సంపూర్ణ లాక్ డౌన్ విధించే అవకాశం ఉందనే చర్చ మొదలైంది. ప్రయాణాలు చేయాలని భావించిన వారు ఈ ఐదు రోజుల్లోనే గమ్యాలకు చేరుకోవాలని, ఆ తరువాత మరో విడత లాక్ డౌన్ అమలులోకి వస్తుందని పలువురు అంటున్నారు. ఈ విషయంలో సోషల్ మీడియాలో సైతం జూలై 1 నుంచి మరో లాక్ డౌన్ అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

కేసుల సంఖ్య పెరుగుతూ ఉండటం, దేశంలోని ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య కరోనా పేషంట్లతో నిండిపోవడం, కొత్త కేసులు వస్తే చికిత్స చేసేందుకు వైద్యులు చేతులెత్తేయాల్సిన పరిస్థితి తలెత్తడంతో కేంద్రం మరోసారి లాక్ డౌన్ దిశగా ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. లాక్ డౌన్ అమలుతోనే పరిస్థితి చక్కబడుతుందని ఇటీవల ముఖ్యమంత్రులు... ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశంలో అభిప్రాయపడ్డారు.

మరో నెలన్నర పాటు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసే దిశగా కేంద్రం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా చేస్తే ఆసుపత్రుల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న వారు రికవరీ అవుతారని, ఆ సమయానికి కేసులు తగ్గడంతో పాటు, వైరస్ ను నిరోధించే డ్రగ్స్ సైతం విరివిగా మార్కెట్లోకి వస్తాయన్న ఆలోచనతో కేంద్రం ఉన్నట్టు సమచారం. అప్పుడు ఒకేసారిగా లాక్ డౌన్ ను ఎత్తివేసి, ఆర్థిక వృద్ధి తిరిగి పుంజుకునేలా అన్ని విధాలా వ్యాపార, వాణిజ్య కార్యక్రమాలకు అనుమతి ఇచ్చేలా, ఓ పటిష్ఠ ప్రణాళికను రూపొందిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంలో త్వరలోనే కేంద్రం నుంచి స్పష్టత వస్తుందని అంటున్నారు.