నోటికి తాళం...సీటుకు ఎసరు... ?

Sat Jan 29 2022 22:00:01 GMT+0530 (India Standard Time)

Lock the mouth and to the seat

టైమ్  అండీ టైమ్ అంటారు అందుకే. ముఖ్యంగా ఈ టైమూ సెంటిమెంట్లు అన్నీ కూడా రాజకీయ నేతలకు బాగా కావలసినవి. ఆ టైమ్ బాగుండకపోతే తాడే పామై కరుస్తుంది. ఇపుడు సోము వీర్రాజు విషయంలో అదే జరిగింది అని స్వపక్షంతో పాటు విపక్షంలో  కూడా అంటున్నారు. బీజేపీకి సంబంధించి ఏపీ పెద్దగా సోము వీర్రాజు తాజాగా రాయలసీమ వాసుల మీద చేసిన దారుణమైన కామెంట్స్ తో నేరుగా తన  సీటుకు చేటు తెచ్చుకున్నారు అని అంటున్నారు.తాను అన్నది తప్పుగా అర్ధం చేసుకున్నారు అని ముందు రోజు దీర్ఘాలు తీసిన సోము సార్ తెల్లవారుతూనే క్షమాపణలు చెప్పేశారు. ఇది జరగడానికి ముందు కేంద్ర పెద్దలకు మొత్తానికి మొత్తం మ్యాటర్ వెళ్లిపోయింది అంటున్నారు. సోము తాను అన్న అర్ధం వేరు అంటూ చెప్పుకున్నా అయినా సరే అంత మాట ఎలా అనేస్తారూ అని కేంద్ర పెద్దలు మండిపడినట్లుగా ప్రచారం సాగుతోంది. అదే టైమ్ లో తక్షణం సారీ చెప్పమని ఆదేశించినట్లుగా భోగట్టా.

ఇక ఈ మధ్య బీజేపీలోకి చేరిన వారిలో రాయలసీమకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు. వారంతా ప్రముఖులు కూడా. అలాంటి నాయకులు కూడా సోము చేసిన కామెంట్స్ తో షాక్ తిన్నట్లుగా భోగట్టా. ఏపీలో బీజేపీని ఏదో విధంగా నిలబెడదామనుకున్న వారందరికీ  ఇబ్బంది కలిగేలా సోము కామెంట్స్ ఉన్నాయని అంటున్నారు.

ఇక బీజేపీలో సోము వీర్రాజు కోవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు అని కూడా అంటున్నారుట. దాంతో హై కమాండ్ సోము వీర్రాజు మీద అన్ని వైపుల నుంచి ఫిర్యాదులు వస్తూండడంతో అలెర్ట్ అయింది అంటున్నారు. ఇపుడు కాస్తా హడావుడి చేస్తూ జిల్లాల టూర్లు చేస్తున్న సోము ఇక మీదట మీడియా ముందుకు రాకపోవచ్చు అని కూడా అంటున్నారు.

ఆయన ప్రెస్ మీట్లు కూడా ఇక ముందు ఉండకపోవచ్చు అని కూడా అంటున్నారు. సోము వీర్రాజుని సైలెంట్ మోడ్ లో ఉంచుతూనే కొత్త ప్రెసిడెంట్ కి కూడా  వెతికి తొందరలో ఏపీ బీజేపీ పగ్గాలు అప్పగిస్తారు అని కూడా ప్రచారం సాగుతోంది. మొత్తానికి సోము వీర్రాజు బీజేపీని ఒక ఊపు ఊపుతారు అనుకుంటే ఆయనే ఇపుడు తన నోటి దూకుడుతో సైడ్ అయిపోయే సీన్ కనిపిస్తోంది అంటున్నారు. మొత్తానికి చూస్తే బీజేపీలో సోము వీర్రాజు ప్రాభవం గత వైభవం అనే అంటున్నారుట.