Begin typing your search above and press return to search.

సూపర్ ఎర్త్ పై జీవరాశులున్నాయట..!

By:  Tupaki Desk   |   5 Aug 2022 11:30 PM GMT
సూపర్ ఎర్త్ పై జీవరాశులున్నాయట..!
X
భూమి గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. భూమి వెలుపల వాటి గురించి కూడా మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. అసలు భూమి వెలుపల ఏం ఉంటుంది? పుడమి బయట ఉన్న గ్రహాలున్నాయా..? ఉంటే వాటిపై జీవులున్నాయా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కనుగొన్నారు అంతరిక్ష పరిశోధకులు. భూగ్రహం వెలుపల ఓ గ్రహాన్ని కనిపెట్టారు. మరి దాని సంగతులేంటో చూద్దామా..?

భూగ్రహం వెలుపల జీవరాశి అన్వేషణలో భాగంగా పాలపుంత బయట రొస్ 508 బీ అనే గ్రహాన్ని అంతరిక్ష పరిశోధకులు గుర్తించారు. నక్షత్రం నుంచి గ్రహం పరిభ్రమిస్తున్న దూరాన్ని బట్టి ఈ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ద్రవ్యరూపంలో నీరు కూడా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

భూగ్రహం నుంచి 37 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ గ్రహం ద్రవ్యరాశి భూమి కంటే 4 రెట్లు అధికంగా ఉంది. అందుకే దీనిని 'సూపర్-ఎర్త్గా పేర్కొంటున్నారు. పాలపుంత వెలుపల ఓ రెడ్ డ్వార్ఫ్స్ నక్షత్రం చుట్టూ ఇది తిరుగుతోంది. కక్ష్యను ఒక్కసారి చుట్టిరావడానికి కేవలం 10.8 రోజుల సమయం మాత్రమే పడుతోంది. అంటే 10.8 రోజుల్లోనే ఆ గ్రహంపై సంవత్సరం పూర్తవుతోంది.

సూపర్ ఎర్త్ - దాని నక్షత్రం మధ్య సగటు దూరం.. భూమి - సూర్యుడి మధ్యదూరం కంటే 0.05 రెట్లు అధికంగా ఉంది. ఆవాసయోగ్యానికి అవకాశమున్న ప్రాంతం వెలుపలికి రావడం, మళ్లీ ఆ ప్రాంతం గుండా వెళ్లడం ఒక్కటే ప్రతికూల అంశంగా అనిపిస్తోందని పరిశోధకులు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ గ్రహంపై నీరు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ కార్యకలాపాలు మొదలైన నేపథ్యంలో భవిష్యత్ పరిశీలనకు రొస్ 508 బీ ఉత్సాహాన్ని నింపనుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

రొస్ 508 బీ గ్రహం దీర్ఘవృత్తాకార కక్ష్యలో నక్షత్రం చుట్టూ తిరిగే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఒక్కసారి కక్ష్యను పూర్తి చేసేందుకు 11 రోజుల సమయం పడుతుండగా ఆవాసయోగ్య జోన్ గుండా వెళ్లే అవకాశముందన్నారు. కాగా ప్రస్తుతం టెలిస్కోపులు నేరుగా ఈ గ్రహాన్ని ఫొటో తీయలేకపోతున్నాయని వివరించారు. ఎందుకంటే నక్షత్ర కేంద్రం గ్రహానికి దూరమే కారణమంటున్నారు. భవిష్యత్‌లో జీవరాశి అన్వేషణ లక్ష్యంగా ఈ గ్రహంపై పరిశోధనలు జరిగే అవకాశం ఉందని ఐఆర్‌డీ-ఎస్ఎస్‌పీ బృందం వెల్లడించింది.

పరిభ్రమిస్తున్న గ్రహం ఉపరితలంపై ద్రవ్య రూపంలో నీళ్లు ఉండగలిగేలా నక్షత్రం నుంచి తగిన దూరంలో ఉండే ప్రాంతాన్నే ఆవాసయోగ్య జోన్గా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతాలనే గోల్డీలాక్ జోన్స్ అని కూడా పిలుస్తారు. జీవం పుట్టేందుకు అనువైన ప్రదేశాలుగా భావిస్తారు. నక్షత్రం చుట్టూ ఉన్న ఈ గోల్డీలాక్స్ జోన్‌ ద్వారా రొస్ 508 బీ పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు గుర్తించారు.