Begin typing your search above and press return to search.

దసరా రోజు రూ.406 కోట్ల మద్యం తాగేశారు!

By:  Tupaki Desk   |   27 Oct 2020 6:45 AM GMT
దసరా రోజు రూ.406 కోట్ల మద్యం తాగేశారు!
X
కరోనా లాక్ డౌన్ తో ప్రజల ఆదాయం తగ్గినా అది మద్యం ప్రవాహాన్ని ఆపడంలో ఏమాత్రం ప్రభావం చూపలేదని తేలింది. జనాలు దసరా పండుగ సందర్భంగా మద్యాన్ని తెగతాగేశారు. తెలంగాణలో బతుకమ్మ, దసరానే పెద్ద పండుగ. ఈరెండు వరుసగా ఒక రోజు తర్వాత మరొకటి వస్తాయి. ఈ క్రమంలోనే మాంసాహారం, మద్యం ఈ పండుగకు కంపల్సరీ. దీంతో ఈసారి తెలంగాణలో మద్యం ఏరులై పారింది. ఈసారి రికార్డ్ సేల్స్ జరిగాయి.

ప్రతీసారి దసరాకు ముందు, ఆ తరువాత కోట్లలో మద్యం విక్రయాలు సాగుతుంటాయి. ఈసారి కూడా తెలంగాణలో మద్యం ఏరులై పారిందని లెక్కలు చెబుతున్నాయి. దసరా, బతుకమ్మ సందర్భంగా దాదాపు మూడు నాలుగు రోజులు మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. ఈసారి ఆదివారం దసరా పండుగ సందర్భంగా రెండు రోజుల ముందు నుంచే అమ్మకాల్లో ఊపు వచ్చింది..

తెలంగాణలో శుక్రవారం రూ. 131 కోట్ల మద్యం విక్రయించగా, శనివారం రూ. 175 కోట్ల లిక్కర్‌ అమ్మకాలు జరిగాయి. ఇక దసరా రోజున ఆదివారం రూ. 100 కోట్ల ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. సోమవారం నాడు ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆరోజు కూడా మద్యం విక్రయాలు బాగానే సాగాయి. మొత్తంగా ఈ నాలుగు రోజుల్లో రూ. 406 కోట్ల మద్యం విక్రయించినట్టు తెలుస్తోంది.

గతేడాది వారం రోజుల్లో రూ. 1374 కోట్ల ఆదాయం వచ్చింది. ఈసారి రూ. 1979 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కరోనా సమయంలోనూ అమ్మకాలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కష్టకాలంలోనూ మద్యం విక్రయాలు తక్కేవేం కాలేదని, గతేడాది కంటే ఎక్కువగానే సాగాయని వారు పేర్కొంటున్నారు.

ఇక ఆన్‌లాక్‌ తరువాత కరోనాను పట్టించుకోకుండా మద్యం బాబులు మందును తెగ తాగేశారు. కరోనా ఆన్‌లాక్‌ సమయంలోనూ రూ. 600 కోట్ల మద్యం విక్రయించారు.. లిక్కర్‌ రేట్లు పెంచినా విక్రయాలపై ఎటువంటి ప్రభావం పడలేదు. అయితే లిక్కర్‌తో పోలిస్తే బీర్లు మాత్రం తక్కువే అమ్ముడుపోయాయి. అయితే బార్లు, రెస్టారెంట్ల కంటే వైన్స్‌షాపుల ద్వారా ఎక్కువగా కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

ఈ దసరా పండుగకు ప్రజలంతా మద్యం మత్తులో మునిగితేలినట్టు మద్యం విక్రయాలను బట్టి తెలుస్తోంది.