24 పెళ్లిళ్లు.. 500 మంది సంతానం కని 256 ఏళ్లు బతికిన ఆయనెవరో తెలుసా..?

Tue Feb 23 2021 09:04:59 GMT+0530 (IST)

Li Ching Yuen 256 Year Old Man?

మానవుడు ఎన్నేళ్లు బతుకుతాడు..? మహా అయితే వందేళ్లు.. ఇంకా చెప్పాలంటే 150 సంవత్సరాలు బతికిన వాళ్లు ఉన్నారు.. అయితే ఈరోజుల్లో మాత్రం ఆరోగ్యంగా ఉంటే 60 ఏళ్లు బతుకుతారు.. కానీ ఓ వ్యక్తి ఏకంగా 256 ఏళ్లు జీవించాడు. ఇది కథ కాదు.. నిజంగా నిజం.. ఆయన 256 ఏళ్లు జీవించాడన్నదానికి ఆధారాలున్నాయంటోంది చైనా ప్రభుత్వం. వింతలు విశేషాలు జరిగే చైనాలో ఏదైనా సాధ్యమే. ఈ వ్యక్తిది కూడా ఆ దేశమే. ఈయన 256 ఏళ్లు జీవించి మరణించాడన్న విషయాన్ని కొన్ని ఆధారాలతో అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది. చాలా ఏళ్ల తరువాత ఇప్పుడీ కథనం ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది..1990వ దశకం వరకు ఒక మనిషి వందేళ్లు బతుకుతాడని నిర్దారించారు. కానీ కాలానుగుణంగా మార్పులు రావడంతో మనిషి జీవిత కాలం రోజురోజుకు తగ్గుతోంది. ప్రపంచీకరణతో పాటు వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులతో మానవుని జీవితకాల రేటు పడిపోతుంది. అయితే చైనాకు చెందిన లీ చింగ్ యుయెన్ 256 ఏళ్లు జీవించాడని తెలవడం చర్చనీయాంశంగా మారింది.

అమెరికాకు చెందిన న్యూయార్క్ టైమ్స్ అనే పత్రిక 1930 లో ఓ కథనాన్ని ప్రచురించింది.  చైనాలోని సిచుయాన్ కు ప్రాంతానికి చెందిన లీ చింగ్ అనే వ్యక్తికి 1827లో అక్కడి ప్రభుత్వం150వ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిందట. అలాగే 1877లో 200వ పుట్టిన రోజును లీ చింగ్ కు ప్రభుత్వం గుర్తు చేసినట్లు ఆధారాలున్నాయని తెలిపింది. అలాగే లీ చింగ్ మరణించే సమయంలో అతనికి 24వ భార్య 60 సంవత్సరాల ఓ మహిళ ఉందని పత్రిక పేర్కొంది.  లీ చింగ్ 1736 లో జన్మించాడని 1933లో లీ మరణించాడని టైమ్స్ తెలిపింది.

అయితే లీ ఇన్ని రోజులు బతకడానికి కారణాలను కూడా అన్వేషించారు. దీంతో వారికి షాకింగ్ నిజాలు ఎదురయ్యాయి. లీ ఎక్కువగా శృంగార జీవితాన్ని అలవాటు చేసుకున్నాడట. అందులో భాగంగా 24 మందిని పెళ్లిచేసుకున్నాడు. 500 మందిని సంతానం కన్నాడు. 256 ఏళ్లలో 11 తరాల వారిని చూశాడట.  అలాగే తన 10 ఏట నుంచే మూలికలు తింటూ పెరిగేవాడట. తన 72వ ఏట అంటే 1749 సంవత్సరంలో చైనా ఆర్మీలో చేరి మార్షల్ ఆర్ట్స్ నేర్పిస్తూ విధులు నిర్వహించేవాడట.

ఇదిలా ఉండగా లీ చనిపోయేనాటికి ఏడు అడుగుల పొడవు పొడవాటి గోళ్లు ఉన్నాయని ఆయన భార్య తెలిపింది. అంతేకాకుండా మంచి కంటి చూపు కూడా ఉందట.  60 సంవత్సరాలు బతకడమే గగనమనుకుంటున్న ఈరోజుల్లో లీ చింగ్ వయసుపై ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది.