Begin typing your search above and press return to search.

న్యాయవాదుల హత్యకేసు: నాలుగు నెలల క్రితమే ప్లాన్?

By:  Tupaki Desk   |   23 Feb 2021 8:30 AM GMT
న్యాయవాదుల హత్యకేసు: నాలుగు నెలల క్రితమే ప్లాన్?
X
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల హత్య తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో నిందితుడైన బిట్టు శ్రీను అలియాస్ శ్రీనివాస్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో అతడు ఇతర నిందితులతో కలిసి కుట్రలో పాల్గొని వారికి కారు, కత్తులను అందించినట్లు పోలీసులు సోమవారం రాత్రి ప్రకటనలో తెలిపారు.

వామన్‌రావు గ్రామానికే చెందిన కుంట శ్రీను మాత్రమే ఈ సీన్‌లో ఉన్నంతవరకు ఈ అనుమానాలకు బలం ఉండేది. కానీ.. ఎప్పుడైతే పెద్దపల్లి జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌‌ మేనల్లుడైన బిట్టు శ్రీను పేరు కూడా వెలుగులోకి వచ్చిందో ఆ అనుమానాలు మరింత రెట్టింపయ్యాయని ప్రచారం సాగింది. అన్నట్టుగానే పోలీసులు బిట్టు శీనును అరెస్ట్ చేశారు. హత్య సమయంలో వినియోగించిన కారుతోపాటు కత్తుల్ని సమకూర్చింది బిట్టు అని తేలడంతో కేసు కీలక మలుపు తిప్పింది. మొదట అతడు వ్యక్తిగత కక్షలతోనే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇక్కడే పోలీసుల చేతికి మరోబలమైన అస్త్రం కూడా దొరికింది.

పోలీసులకు బిట్టు శ్రీను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. గుంజపడుగు గ్రామానికి చెందిన కుంట శ్రీనివాస్ తో బిట్టు శ్రీనివాస్ కు ఆరేళ్ల క్రితం స్నేహం ఏర్పడింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులయ్యారు. మద్యం తాగే సమయంలో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లు. ఈ క్రమంలోనే వారి మధ్య వామన్‌రావు దంపతుల గురించి చర్చ వచ్చింది. గుంజపడుగు గ్రామానికే చెందిన వామన్‌రావు దంపతులతో కుంట శ్రీనుకు కూడా శత్రుత్వం ఉంది. గ్రామంలో తన ఆధిపత్యానికి వామన్‌రావు అడ్డు వస్తున్నట్టు భావించిన కుంట శ్రీను.. బిట్టు శ్రీనుతో కలిసి హత్యకు ప్రణాళిక రచించాడు. అందులో భాగంగా నాలుగు మాసాల క్రితమే.. గుంజపడుగుకు వచ్చిన వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీనివాస్‌ యత్నించాడు. ఆయనను హత్య చేసేందుకు బిట్టు శ్రీనివాస్‌ ట్రాక్టర్‌ పట్టీలతో రెండు కత్తులు తయారు చేయించి.. చిరంజీవి ఇంట్లో పెట్టాడు. నాలుగు నెలల క్రితం వామన్‌ రావు 15 మందితో మూడు కార్లలో మంథని కోర్టుకు వచ్చారు. వారిని చూసిన చిరంజీవి.. బిట్టు శ్రీనుకు సమాచారం ఇవ్వగా, అతడు ఆ విషయాన్నికుంట శ్రీనివాస్ కు చెప్పాడు. దీంతో వామన్‌రావును హత్య చేసేందుకు కుంట శ్రీను గుంజపడుగు బస్టాప్ లో కొద్దిసేపు ఎదురు చూశాడు. అయితే వామన్‌రావు ఎక్కువ మందితో రావడంతో హత్యాయత్నాన్ని అప్పటికి విరమించుకున్నాడు.

కానీ, వామన్‌రావు ఒంటరిగా దొరికే సమయం కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఈ నెల 17న మధ్యాహ్నం.. వామన్‌రావు దంపతులు మంథని కోర్టుకు వచ్చినట్టు.. కోర్టు వద్ద ఉన్న లచ్చయ్య కుంటశ్రీనుకు తెలిపాడు. అతడు వెంటనే బిట్టు శ్రీనివాస్ కు ఫోన్‌ చేసి విషయం చెప్పాడు. బిట్టు శ్రీను శివనందుల చిరంజీవికి ఫోన్‌ చేసి.. కత్తులను తీసుకుని అర్జెంట్‌గా మంథని బస్టాప్‌ దగ్గరికి రావాలని చెప్పాడు. చిరంజీవి ద్విచక్ర వాహనంపై కత్తులు తీసుకుని రాగా, బిట్టు శ్రీను తన కారును చిరంజీవికి ఇచ్చి పంపాడు.

కల్వచర్ల వద్ద వామన్‌రావు దంపతులను చంపిన అనంతరం.. చిరంజీవి ఆ విషయాన్ని బిట్టు శ్రీనుకు ఫోన్‌ చేసి చెప్పాడు. వెంటనే మహారాష్ట్రకు వెళ్లిపోవాల్సిందిగా చిరంజీవికి బిట్టు శ్రీను సూచించాడు. కాగా.. చిరంజీవి వినియోగించిన మోటార్‌ సైకిల్‌, ఒక సెల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.ఇవే హత్యకేసులో కీలకంగా ఉన్నాయి.