Begin typing your search above and press return to search.

హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త రికార్డు!

By:  Tupaki Desk   |   3 Dec 2021 9:36 AM GMT
హైదరాబాద్ రియల్ రంగంలో సరికొత్త రికార్డు!
X
భాగ్యనగరి భాగ్యం మామూలుగా లేదు. క్యాలెండర్లో రోజులు మారేకొద్దీ.. రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. పాత రికార్డులు చెరిగిపోతున్నాయి. తాజాగా నిర్వహించిన ఉప్పల్ భగాయత్ భూముల వేలంలో పలికిన ధర సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసింది. నగరానికి ఒక మూలన..ఆ మాటకు వస్తే శివారులో ఉన్న ఈ భూములు గజం లక్ష రూపాయిల మార్కును దాటేయటం చూస్తే.. హైదరాబాద్ భూముల విలువ ఎక్కడికి వెళ్లనుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరో ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఇప్పుడు వేలం వేస్తున్న భూములు.. గతంలో వేలం వేయటానికి ప్రయత్నించి.. అమ్ముడు పోనివి. అప్పట్లో అమ్ముడుపోని ఈ భూముల ఇప్పుడు బంగారంలా మారి.. సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే ధరలు పలకటం హాట్ టాపిక్ గా మారింది. రియల్టర్ల అంచనాలు.. హెచ్ఎండీఏ అధికారులు లెక్కలు తప్పి.. ఊహించని రీతిలో వేలంలో పలికిన ధరలకు అధికారులు సైతం అవాక్కు అవుతున్నారు.

తాజాగా ఉప్పల్ భగాయత్ లోని ఫేజ్ 1.. ఫేజ్ 2 లేఔట్లలో 23 ఫ్లాట్లను గురువారం కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఎంఎస్టీసీ ద్వారా హెచ్ఎండీఏ ఈ-వేలాన్ని నిర్వహించారు. ఇందులో 21 నివాసిత ప్లాట్లు కాగా.. రెండు మాత్రం వాణిజ్య ప్లాట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు గజానికి అప్ సెట్ ధర రూ.35 వేలుగా నిర్ణయిస్తే..ఏకంగా మూడు రెట్లు ఎక్కువగా గజం రూ.లక్ష మార్కును దాటేయటం విశేషం. ఇప్పటివరకు ఐటీ కారిడార్ గా పేరున్న మాదాపూర్.. గచ్చిబౌలి.. హైటెక్ సిటీ ప్రాంతాల్లో ఇలాంటి ధరలు పలికేవి.

ఇందుకు భిన్నంగా హైదరాబాద్ నగర శివారుల్లో ఒకటైన ఉప్పల్ భగాయత్ భూములకు ఇంత భారీ ధర పలకటం విశేషంగా చెబుతున్నారు. అయితే.. ఇదంతా రియల్ ఎస్టేట్ వర్గాల మాయాజాలమన్న వాదన వినిపిస్తోంది. ఎందుకంటే.. వేలంలో భాగంగా తక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లకు భారీ ధరను పెట్టటం చూస్తే.. ఇందులో ఏదో మతలబు ఉందన్న వాదన రియల్ వర్గాల్లో వినిపిస్తోంది. గజం లక్ష రూపాయిల మార్కు దాటిన రెండు ప్లాట్లు తక్కువ విస్తీర్ణం ఉన్నవి కావటం.. ఆ ధరే హైలెట్ కావటం చూసినప్పుడు.. పెద్ద బిట్లు మాత్రం తక్కువ ధర (గజం రూ.77వేలు) పలకటం గమనార్హం.

ఇప్పటి ఉప్పల్ భగాయత్ మాత్రమే కాదు.. గతంలోని కోకాపేటలో జరిగిన భూముల వేలంలోనూ..తక్కువ విస్తీర్ణం కలిగిన ప్లాట్లకు అత్యధిక ధరకు సొంతం చేసుకోవటం ద్వారా.. ఆ ధరే ప్రముఖంగా అందరి నోట్లో నానటం ద్వారా.. సదరు ప్రాంతంలో భూముల ధరల్ని భారీగా పెంచేందుకు వీలవుతుందన్న మాట వినిపిస్తోంది. ఈ లెక్కల సంగతి ఎలా ఉన్నా.. నగర శివారులో ఇంత భారీ ధర పలకిన నేపథ్యంలో హదరాబాద్ రియల్ రంగం మరింత వేగవంతం అయ్యే అవకాశం ఉంది.