Begin typing your search above and press return to search.

మోడీకి మించిన మొనగాడు ఎందుకు రావట్లేదు? సర్వే ఏం చెప్పింది?

By:  Tupaki Desk   |   22 Jan 2022 4:55 AM GMT
మోడీకి మించిన మొనగాడు ఎందుకు రావట్లేదు? సర్వే ఏం చెప్పింది?
X
దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన నేతగా.. ఇప్పటివరకు దేశానికి ప్రధానమంత్రులుగా వ్యవహరించిన బలమైన నేతల వరుసలోనూ మొదటి వ్యక్తిగా నిలిచి రికార్డును క్రియేట్ చేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఇంతకూ ఆయన్ను అంతలా బలమైన నేతగా ఎవరు చూపిస్తున్నారు? ఆయనకు అంత ఆదరణ ఎలా సాధ్యమైంది? దాదాపు ఏడున్నరేళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ.. ఆయనపై ప్రజల్లో నమ్మకం పాళ్లు ఎందుకు తగ్గట్లేదు? మోడీ వారసుడిగా ఎవరున్నారు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికినప్పుడు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. తాజాగా ఇండియా టుడు - సీ ఓటరు సర్వే వెల్లడించిన అంశాలు.. విషయాలు మరింత బాగా అర్థమయ్యేలా ఉన్నాయని చెప్పక తప్పదు.

ప్రధానమంత్రిగా మోడీ ఇంతలా వెలిగిపోవటానికి ప్రధాన కారణం.. ఆయనకు సరైన ప్రత్యామ్నాయం లేకపోవటమే. మోడీ కాకుండా.. ఆయన తరహాలో యావత్ దేశం మొత్తానికి ఆమోదయోగ్యుడైన నేత ఎవరూ లేకపోవటం.. ఉన్న వారెవరూ ఆయన దరిదాపుల్లోకి రాకపోవటం ఒక ప్రధాన కారణంగా చెప్పక తప్పదు. మోడీ పని తీరుకు వ్యతిరేకంగా జనం మరెవరినీ చూసేందుకు ఇష్టపడకపోవటానికి ప్రధాన కారణం.. ప్రతిపక్షాలకు చెందిన మరే నేత.. ఆయన్ను రిప్లేస్ చేసే నేతను గుర్తించేలా వ్యవహరించకపోవటమేనని చెప్పాలి.

దేశానికి ప్రధానమంత్రులగా.. బలమైన ప్రజాదరణ ఉన్న వారిగా గుర్తింపు పొందిన ఇందిరాగాంధీ.. అటల్ బిహారీ వాజపేయ్.. జవహర్ లాల్ నెహ్రూ కంటే మంచి ప్రధానిగా మోడీని ప్రజలు భావిస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది. మరి.. మోడీకి ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి అభ్యర్థులు ఎవరు? అన్నప్రశ్నకు సమాధానం అడిగితే..కేవలం 17 శాతం మంది పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అని పేర్కొంటే.. తర్వాతి స్థానంలో 16 శాతం మంది ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అని పేర్కొన్నారు.

ఒకవేళ.. బీజేపీలోనే మోడీ కాకుండా మరెవరిని ఆయన వారసుడిగా ఎంచుకుంటారంటే.. ఆశ్చర్యకరంగా అత్యధికులు అమిత్ షాను తమ తొలి ఛాయిస్ గా.. రెండో ఛాయిస్ గా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గా చెప్పటం విశేషం. ప్రధానమంత్రి అయ్యే అవకాశమే కాదు.. చివరకు విపక్ష నేతగా ఉండే అర్హత రాహుల్ కు 11 శాతం మందే ఓకే చెప్పటం గమనార్హం.

మోడీ సర్కారును ప్రతిపక్ష కూటమి సవాలు చేయగలదని దేశంలోని 50 శాతం మంది ప్రజలు భావిస్తున్నారని పేర్కొంది. రానున్న రెండేళ్లు మోడీకి ఎంతో కీలకమని.. హిందూ ఓటర్లను సంఘటితం చేయటం.. జాతీయవాదం జోరు పెంచటం.. జనాలకు తాయిలాలు పంచిపెట్టే సంక్షేమవాదం వల్ల నెగ్గుకు రావటం కష్టమని తాజా సర్వే వెల్లడించింది.

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు బడా వ్యాపార సంస్థలకు భారీ దన్నుగా నిలుస్తాయని పేర్కొంది. అయితే.. దేశంలో స్వేచ్ఛగా మాట్లాడే వాతావరణం లేకపోవటం.. ప్రజాస్వామిక సంస్థల ప్రమాణాలు పడిపోవటం.. మైనార్టీల్లో పెరుగుతున్న ఆందోళనలు ఆయనకు వ్యతిరేకంగా మారినట్లుగా ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో స్పష్టమైందని చెబుతున్నారు.