Begin typing your search above and press return to search.

ఆ రెండు ఇష్యూల మీద జగన్ తాజా వ్యాఖ్యలు వింటే ‘కామెడీ’నే?

By:  Tupaki Desk   |   24 Sep 2021 12:30 PM GMT
ఆ రెండు ఇష్యూల మీద జగన్ తాజా వ్యాఖ్యలు వింటే ‘కామెడీ’నే?
X
కారణం ఏదైనా ఒక్కో ప్రభుత్వంలో కొన్ని తప్పులు.. పొరపాట్లు జరుగుతుంటాయి. అలాంటి వాటికి సంబంధించిన వచ్చే నెగిటివ్ వార్తలు.. నిఘా వర్గాల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ తో పాటు.. ఇటీవల కాలంలో పెరిగిపోయిన సోషల్ మీడియా పుణ్యమా అని.. ప్రభుత్వాలు చేసే తప్పుల్ని ఇట్టే పట్టేయొచ్చు. ఎవరు ఎలాంటి మోటివ్ తో వార్తలు రాస్తున్నారు.. వివరాల్ని అందిస్తున్నారన్న విషయాన్ని గుర్తించటం అంత కష్టమైన పని అయితే కాదు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే.. ఆయన తన పాలనకు సంబంధించి కొన్నిసార్లు మాట్లాడే మాటలు.. ఆయన చేసే వ్యాఖ్యలు విన్నప్పుడు.. ఆయన జోకులు వేసినట్లుగా ఉంటాయి. మరీ.. ఇంత అమాయకంగా మాట్లాడుతున్నారే? అన్న భావన కలిగేలా చేస్తాయి. జగన్ కు తెలిసే ఇలా మాట్లాడుతున్నారా? లేక పూర్తి సమాచారం అందక ఇలాంటి తప్పులు చేస్తున్నారా? అన్న సందేహం కలుగక మానదు.

కొన్ని విషయాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగి.. ఒక ఐడియాకు వచ్చిన తర్వాత.. దానికి భిన్నమైన వాదనను వినిపిస్తే.. అవన్నీ జోకులుగా.. కామెడీగా మారటం ఖాయం. ఇలాంటి వాటితో ఇమేజ్ డ్యామేజ్ కావటం ఖాయం కూడా. అందుకే.. అందరికి తెలిసిన విషయాల మీద.. అవగాహన ఉన్న అంశాల మీద మాట్లాడేటప్పుడు.. ఆచితూచి అన్నట్లుగా రియాక్టు కావాలే తప్పించి.. తొందరపాటు అస్సలు పనికి రాదు.

ఏపీ ముఖ్యమంత్రి తాజాగా రెండు కీలక అంశాల మీద రివ్యూ నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. అందులో ఒకటి లిక్కర్ అయితే రెండోది శాండ్. నిజానికి రెండున్నరేళ్ల జగన్ పాలనలో ఈ రెండు ఇష్యూలు ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున డ్యామేజ్ చేయటంతో పాటు.. విమర్శలకు తావిచ్చిందని చెప్పాలి. తాజాగా రివ్యూ నిర్వహించిన ఆయన.. మద్యం నియంత్రణలో భాగంగా రేట్లను పెంచినట్లుగా చెప్పిన ఆయన.. మూడింట ఒక వంతు దుకాణాల్ని మూశామని.. బెల్ట్ షాపుల్ని.. పర్మిట్ రూములను తీసేసినట్లుగా చెప్పారు.

లిక్కర్ అమ్మకాలు నెలకు 34 లక్షల కేసుల నుంచి 21 లక్షల కేసులకు తగ్గినట్లుగా చెప్పారు. బీరు అమ్మకాలు 17 లక్షల కేసుల నుంచి 7 లక్షల కేసులకు తగ్గినట్లు చెప్పారు. ఇన్ని లెక్కలు చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి.. మద్యం ద్వారా వచ్చే ఆదాయం ఎంతమేర తగ్గిందన్న విషయాన్ని మాత్రం వెల్లడించకపోవటం గమనార్హం. ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలంటే.. జగన్ ప్రభుత్వాన్ని బాగా డ్యామేజ్ చేసిన అంశం ఏమైనా ఉందంటే వాటిల్లో ముఖ్యమైనది లిక్కర్ పాలసీ.. రెండోది ఇసుక వ్యవహారం.

సీఎం చెప్పినట్లుగా లిక్కర్ అమ్మకాలు తగ్గాయి కానీ.. అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తున్న మద్యం భారీగా పెరిగింది. దీనికి తోడు.. చీప్ లిక్కర్ దొంగతనంగా తయారు చేయటం కూడా పెరిగింది. ఆ అంశాల్ని పరిగణలోకి తీసుకోకుండా.. ప్రభుత్వ అమ్మకాల్ని చూపించి.. లిక్కర్ వినియోగం తగ్గిందని చెప్పటం కామెడీనే అవుతుంది.

ఇక.. ఇసుక విషయానికి వస్తే.. ఇసుకను ప్రభుత్వం నిర్దేశించిన దాని కంటే ఎక్కువ ధరకు అమ్మితే చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. వర్షాలు తగ్గిన వెంటనే మరిన్ని రీచ్ లను.. డిపోలను పెంచాలన్న ఆదేశాల్ని ఆయన జారీ చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్దేశించిన ధరకు ఏ మాత్రం పోలిక లేకుండా భారీగా ఇసుక ధర పెంచేశారని.. సిమెంట్ ధరతో ఇసుక ధర పోటీ పడుతుందన్నారు.

అంతేకాదు.. ఇసుకను అమ్ముతున్న ప్రభుత్వం.. అధికారికంగా దానికి నిర్దారించిన ధరకు పలు రెట్లు ఎక్కువకు అమ్ముతున్నారని.. ఈ ధరా భారం నుంచి అధికార వైసీపీ నేతలు సైతం తప్పించుకోలేకపోతున్నారని వ్యాఖ్యానించటం విశేషం. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి 12,211 కేసులు నమోదయ్యాయని.. అలాగే 5.72 లక్షల టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 16,365 వామనాల్ని జఫ్తు చేశారని.. 22,769మంది నిందితుల్ని అరెస్టు చేసినట్లుగా సమీక్షా సమావేశంలో వెల్లడించారు. ఇసుక అక్రమాలకు సంబంధించి నమోదైన కేసుల సంఖ్య ఇంతలా ఉంటే.. తప్పులు చేస్తూ దొరకకుండా తప్పించుకున్న వారి సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని పలువురు చెబుతు న్నారు. ఇలాంటి అంశాల మీద మాట్లాడేటప్పుడు గ్రౌండ్ లెవెల్ వాస్తవాల్ని వదిలేసి.. మాట్లాడితే అభాసుపాలు అయ్యే అవకాశాలే ఎక్కువన్న విషయాన్ని ఏపీ ముఖ్యమంత్రి ఎలా మిస్ అవుతున్నారు?