Begin typing your search above and press return to search.

దేశమంతా కరోనా జోరు.. రివర్సులో ముంబయి

By:  Tupaki Desk   |   16 Jan 2022 6:11 AM GMT
దేశమంతా కరోనా జోరు.. రివర్సులో ముంబయి
X
కేసుల మీద కేసులు. అంతకంతకూ పెరుగుతున్న పాజిటివ్ రేట్లతో కొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే దిశగా పరుగులు తీస్తోంది కరోనా మహమ్మారి. డిసెంబరు 23న దేశవ్యాప్తంగా రోజువారీ కేసులు 6వేల వరకు ఉంటే.. డిసెంబరు 31 నాటికి రోజుకు 22 వేలకు పైకి చేరుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలో అంటే జనవరి 2 నాటికి ఒక్కరోజులో కొత్త కేసులు 33,750కు చేరుకున్నాయి. కట్ చేస్తే.. జనవరి10 నాటికి రోజుకు 1.68 లక్షల చొప్పున కొత్త కేసులు నమోదవుతుంటే.. జనవరి 14 నాటికి రోజు వారీ కొత్త కేసులు 2.11 లక్షలుగా నమోదైతే.. జనవరి 15 నాటికి ఇది కాస్తా 2.68 లక్షలుగా నమోదైంది. అంటే.. రోజు తేడాతో కొత్త కేసుల సంఖ్య 50వేల చొప్పున పెరుగుతున్న వైనం చూస్తే.. కేసుల తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న ఇట్టే అర్థమవుతుంది. ఇలాంటి వేళ.. దేశ వ్యాప్తంగా కరోనా తీవ్రత ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తెలిపే ఐదు అప్డేట్స్ ను చూస్తే..

1. అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా దేశ వ్యాప్తంగా కరనా కొత్త కేసుల సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. పలు రాష్ట్రాల్లో నమోదవుతున్న కొత్త కేసులు కొత్త రికార్డుల్ని క్రియేట్ చేస్తున్నాయి. కర్ణాటలో శనివారం ఒక్కరోజున 33,793 కొత్త కేసులు నమోదుకావటం గమనార్హం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమంటే.. ఈ మొత్తం కేసుల్లో ఒక్క బెంగళూరు మహానగరంలో ఒక్కరోజులో 22,284 కొత్త కేసులు నమోదు కావటం ఆందోళన కలిగించేలా మారింది.

2. కర్ణాటకకు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజులో 23,989 కేసులు నమోదు అయ్యాయి. దీంతో.. కేసుల తగ్గేందుకు వీలుగా పలు నియంత్రణ చర్యల్ని చేపట్టారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. కేరళలో ఒమిక్రాన్ కేసులు సంఖ్య పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ఒక్కరోజులోనే 20వేలకుపైగా కొత్తకేసులు నమోదు అయ్యాయి. తాజాగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 30.64 శాతంగా ఉన్నట్లు చెబుతున్నారు.

3. వచ్చే నెలలో మొదలు కానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యూపీలో.. కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. జనవరి 15న ఒక్కరోజే 15,795 మంది పాజిటివ్ గా తేలారు. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు.. పట్టణాల్లో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ఎన్నికలకు సంబంధించిన పరిమితుల్ని ప్రకటించినా.. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలుప్రతిష్ఠాత్మకంగా మారటంతో.. ఎవరూ తగ్గట్లేదు. దీంతో.. రానున్న రోజుల్లో మరింత ఎక్కువగా కేసులు నమోదు కావటం ఖాయమంటున్నారు. పార్లమెంటులో కొవిడ్ బారిన పడిన సిబ్బంది సంఖ్య 850కు చేరుకుంది. వీరిలో 250 మంది సెక్యురిటీ సిబ్బందే ఉండటం గమనార్హం.

4. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతుంటే.. అందుకు భిన్నంగా దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో మాత్రం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టటం విశేషం. శనివారం 54 వేలకుపైగా పరీక్షలు చేస్తే.. కేవలం 10,661 కేసులు మాత్రమే వెలుగు చూశాయి. అంతేకాదు.. కొత్తగా కొవిడ్ అని తేలిన వారిలో 84 శాతం మందికి అసలు కొవిడ్ లక్షణాలే లేకపోవటం మరో విశేషంగా చెబుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ముంబయిలో తగ్గటం చూస్తే.. మూడో వేవ్ నుంచి ముంబయి మహానగరం బయట పడినట్లేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఇందుకు భిన్నంగా కశ్మీర్ లో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది.గడిచిన 2 వారాల్లో కశ్మీర్ వ్యాప్తంగా పలు ఆసుపత్రుల్లో 250 మంది వైద్యులు.. పారామెడికల్ సిబ్బందిని మహమ్మారి కమ్మేసినట్లుగా చెబుతున్నారు.

5. దేశంలో మూడో వేవ్ తీవ్రత ఎక్కువగా ఉన్న వేళ.. వచ్చే నెలలో జరగాల్సిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘంసరికొత్త మార్గదర్శకాల్నిజారీ చేసింది. పలు పరిమితుల్ని విధించింది. అవేమంటే..

- ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో రోడ్ షోలు.. పాదయాత్రలు.. సైకిల్.. బైక్ ర్యాలీలపై బ్యాన్ పొడిగింపు
- ఈ నెల 22న వరకు ఎన్నికల ర్యాలీలు.. రోడ్ షోలపై నిషేధాన్ని పొడిగిస్తూ నిర్ణయం
- బహిరంగ సభల మీద బ్యాన్ ఉంది
- సమావేశ మందిరాలు.. హాళ్లలోనిర్వహించే ఎన్నికల ప్రచార సభలకు 300 మందికి మించకూడదు. లేదంటే.. హాలు సామర్థ్యంలో 50 శాతానికి మించకూడదు.