Begin typing your search above and press return to search.

తాజా సివిల్స్ ఫలితాలు ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పి?

By:  Tupaki Desk   |   25 Sep 2021 9:30 AM GMT
తాజా సివిల్స్ ఫలితాలు ఏపీ సర్కారుకు కొత్త తలనొప్పి?
X
దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా చెప్పే సివిల్స్ సర్వీసుకు 2020 బ్యాచ్ కు ఎంపికైన విజేతల ఫలితాలు శుక్రవారం సాయంత్రం విడుదల కావటం తెలిసిందే. ఈసారి ప్రత్యేకత ఏమంటే.. తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు యాభై మంది వరకు అభ్యర్థులు ఫలితాల్లో చోటు చిక్కించుకున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా విడుదలైన సివిల్స్ ఫలితాలు ఏపీ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయన్న మాట వినిపిస్తోంది. దీనికి కారణం లేదు. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పోటీ పరీక్ష రాసి.. ఎంపిక కాని ఆరుగురు.. తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో దేశంలోనే టాప్ ర్యాంకులు సాధించటం ఇప్పుడు చర్చగా మారింది.

ఏపీలో నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షా విధానంలో లోపాలు ఉన్నాయని.. డిజిటల్ మూల్యాంకనం పేరుతో అక్రమాలు చోటు చేసుకున్నాయని.. ఇందులో పలువురి పాత్ర ఉందంటూ న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించారు గ్రూప్ 1 అభ్యర్థులు. అలా కోర్టు మెట్లు ఎక్కిన వారిలో ఆరుగురు తాజాగా వెలువడిన సివిల్స్ ఫలితాల్లో మంచి ర్యాంకులతో ఉత్తీర్ణులు కావటం ఏపీ సర్కారుకు ఇబ్బందికరంగా మారినట్లైంది. ఇంతకాలం ఇదంతా తప్పుడు ప్రచారమని ఎదురుదాడి చేసిన వారి నోళ్లు మూతపడే పరిస్థితి. నిజంగానే గ్రూప్ 1కు ఎంపిక కాలేని వారు జాతీయ స్థాయిలో వివిధ దశల్లో జరిగే వడపోతల గండాల్ని దాటుకొని విజేతలుగా నిలవటం అంత తేలికైన విషయం కాదు.

ఈ అంశం ఇప్పుడు విపక్షాలకు ఆయుధంగా మారింది. గ్రూప్ 1లో అక్రమాలు జరిగాయని.. తమకు కావాల్సిన వారికి ఉద్యోగాలు కట్టబెట్టారన్న మరకకు ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఇంతకాలం ఆరోపణలుగా ఉన్న ఎపీపీఎస్సీ అక్రమాలు నిజమేనా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. గ్రూప్ 1కు ఎంపిక కాక.. సివిల్స్ లో ఎంపికైన ర్యాంకర్ల వివరాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారికి సంబంధించిన జాబితాను షేర్ చేస్తున్నారు. వారి వివరాల్నిచూస్తే..

1. జగత్ సాయి (32 ర్యాంకు)
2. యశ్వంత్ (93 ర్యాంకు)
3. వసంత్ కుమార్ (170 ర్యాంకు)
4. సంజనా సింహ (207 ర్యాంకు)
5. బయ్యపు రెడ్డి చైతన్య (604 ర్యాంకు)
6. సాహిత్య (647 ర్యాంకు)