Begin typing your search above and press return to search.

యూఎస్ ఓపెన్.. ఆ దిగ్గజ క్రీడాకారిణిని చూసేందుకు చివరి టోర్నీ

By:  Tupaki Desk   |   29 Aug 2022 11:54 AM GMT
యూఎస్ ఓపెన్.. ఆ దిగ్గజ క్రీడాకారిణిని చూసేందుకు చివరి టోర్నీ
X
ప్రపంచంలో అత్యంత ఆదరణ పొందిన క్రీడలు ఐదారే ఉంటాయి. అందులో ఫుట్ బాల్ ది మొదటి స్థానం. వందల కోట్ల మంది దీనికి అభిమానులుంటారు. రెండోది క్రికెట్, మూడోది టెన్నిస్ అని చెప్పవచ్చు. హాకీ, బేస్ బాల్, బాస్కెట్ బాల్ తదితరాలు తర్వాతి స్థానంలో ఉంటాయి. కాగా, ఫుట్ బాల్ ను ప్రపంచ కప్ వచ్చిన ఏడాది అత్యధిక మంది చూస్తుంటారు. ఆ తర్వాత లీగ్ లు, ఇతర టోర్నీలు ఉన్నప్పడు వీక్షిస్తుంటారు. క్రికెట్ కూడా అంతే.

అయితే, ఏడాదంతా ప్రేక్షకులు, అభిమానులు ఆరాధించే ఆట ఒకటుంది. అది టెన్నిస్. ఈ క్రీడలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి గ్రాండ్ స్లామ్ లు. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యూఎస్ ఓపెన్.. ఇలా ఏడాదికి నాలుగు చొప్పున జరిగే గ్రాండ్ స్లామ్ లు అభిమానులను ఆకట్టుకుంటాయి. వీటిలో ప్రత్యేకత ఏమంటే.. నాలుగు గ్రాండ్ స్లామ్ లు నాలుగు దేశాల్లో జరుగుతాయి.

ఆ నల్ల కలువకు ఇదే ఆఖరు

ఓ పాతికేళ్ల కిందట ముందుగా ఓ అక్క.. ఆమె అడుగుల్లో చెల్లెలు.. మహిళల టెన్నిస్ లోకి దూసుకొచ్చారు. మొదట్లో వారి ఆటను అందరూ ఎగతాళి చేశారు. మహిళల టెన్నిస్ లోని సొగసు వీరి ఆటలో లేదని నిందించారు. అయితే, అలాంటివారందరి నోళ్లు మూయిస్తూ ఆ అక్కాచెల్లెళ్లు ముందుకుసాగారు. వారే వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్. నల్ల జాతి ప్రతిభకు ప్రతి రూపాలుగా ఎదిగిన వీరు టెన్నిస్ సామ్రాజ్యాన్ని 15 ఏళ్లు ఏలారు.

కొన్నాళ్ల పాటు గ్రాండ్ స్లామ్ టైటిళ్లన్నీ వీరిద్దరి మధ్యనే తిరిగేవి. అంతగా ఆటను ప్రభావితం చేశారు. అక్క వీనస్ ను మించి ప్రతిభ కనబర్చిన సెరెనా తన సుదీర్ఘ ప్రస్థానంలో 23 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు కొట్టింది. ప్రపంచ మహిళల టెన్నిస్‌లో దిగ్గజంగా ఎదిగింది. ఇప్పుడామె తన కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీకి సిద్ధమైంది! సోమవారం రాత్రి నుంచి జరిగే యుఎస్‌ ఓపెన్‌ బరిలో దిగుతోంది.

సొంతగడ్డపై చివరి గ్రాండ్ స్లామ్

ఆధునిక శకంలో మహిళల టెన్నిస్‌లో మార్గరెట్‌ కోర్ట్ (24) తర్వాత రికార్డు స్థాయిలో 23 టైటిళ్లు సాధించింది సెరెనా. ఓ దశలో కోర్ట్ రికార్డును అధిగమిస్తుందని భావించినా.. సాధ్యం కాలేదు. ఇప్పుడు చివరిగా సొంతగడ్డపై యూఎస్ ఓపెన్ ఆడుతున్న ఆమెకు కోర్ట్ రికార్డు టైటిళ్లను సమం చేసే అవకాశం దక్కింది. కాగా, సరిగ్గా ఐదేళ్ల కిందట బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆటలో అడుగుపెట్టింది సెరెనా. ఆమెకిప్పుడు 40 ఏళ్లు.

ఎప్పుడో 2009లో చివరి సారిగా యుఎస్‌ ఓపెన్‌లో నెగ్గింది. ఇప్పుడు అంచనాలు తక్కువగానే ఉన్నాయి. విశేషమేమంటే అక్క వీనస్‌తో కలిసి డబుల్స్‌ బరిలోనూ దిగుతోంది. నాలుగేళ్ల తర్వాత అక్కాచెల్లెలు జట్టు కట్టడం ఇదే తొలిసారి. యుఎస్‌ ఓపెన్‌లో 2014 తర్వాత ఇదే మొదటిసారి. సెరెనా విలియమ్స్‌ చివరి సారి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో.. అదీ సొంతగడ్డపై ఆడుతుండడంతో భావోద్వేగం నెలకొంది. 1999లో 17 ఏళ్ల వయసులో యుఎస్‌ ఓపెన్‌లో ఆమె విజేతగా నిలిచి గ్రాండ్‌స్లామ్‌ ఖాతా తెరవడం విశేషం. ఇప్పుడదే టోర్నీలో రికార్డు, చివరి టైటిల్ వేటలో ఉండడం మరో విశేషం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.