అతిపెద్ద అగ్నిపర్వతం బద్దలై 13 మంది మృతి..

Sun Dec 05 2021 16:00:01 GMT+0530 (IST)

Large volcano erupts, killing 13

ఇండోనేషియాలోని అగ్ని పర్వతం బద్ధలైంది. జావా ద్వీపంలోని అతిపెద్ద అగ్ని పర్వతం సెమేరు నుంచి శనివారం అర్ధరాత్రి దాటిన తరువాత దట్టమైన పొగ వెలువడింది. దీంతో ఇప్పటి వరకు 13 మంది మరణించినట్లు అక్కడి ప్రభుత్వం తెలిపింది. అలాగే 90 మంది గాయపడ్డారు. 900 మందికి పైగా సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు ఇండోనేషియా డిజాస్టర్ మైటిగేషన్ అధికారులు తెలిపారు. సెమేరు విస్ఫోటనానికి సంబంధించిన దృశ్యాలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దేశంలో 130కిపైగా అగ్నిపర్వతాలుండగా సెమేరు అతిపెద్దదిగా పిలవబడుతోంది.అగ్నిపర్వతం బద్ధలవడంతో అందులోనుంచి దట్టమైన పొగ వెలువడిందని ఈ పొగ కారణంగా సూర్యరశ్మిని కూడా చూడలేకపోయామని స్థానికులు తెలిపారు. సుమారు 50 వేల అడుగులు ఎత్తు వరకు ఈ బూడిద ఆవహించిందని అంటున్నారు. దీంతో ఇటువైపు నుంచి విమానాలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. కాగా ఈ ప్రమాదంతో చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. సెమేరు అగ్ని పర్వతం విస్పోటనం కారణంగా సమీపంలో ఉన్న రోడ్లు వంతెనలు ధ్వంసమయ్యాయని స్థానిక ధికారి తారిక్ ఉల్ హక్ తెలిపారు.

ఇక అగ్ని పర్వతం నుంచి వెలువడిన పొగ అరేబియా సముద్రం వైపు వెళ్తున్నట్లు తెలిపారు. 15 వేల మీటర్ల ఎత్తు వరకు బూడిద మేఘం ఆవహిస్తే ఆ మార్గంలో విమానాలను వెళ్లనివ్వరు. ఈ మార్గం గుండా విమానాలు వెళ్తే ఇంజన్లోని చల్లని భాగాలపై ఆ బూడిద పేరుకొని గట్టపడుతుంది. దీంతో గాలి ప్రవాహానికి ఆటంకం ఏర్పడి ఇంజిన్ పనిచేయకుండా పోతుంది. సాధారణంగా విమానాలు 15వేల మీటర్ల కంటే తక్కువగానే వెళ్తాయి. దీంతో ఆస్ట్రేలియాలోని డార్విన్ లో ఉన్న 'వాల్కానిక్ యాష్ అడ్వైజరీ సెంటర్' దట్టమైన పొగ నైరుతి దిశగా వెళ్తున్నట్లు సమాచారాన్ని తెలిపింది. అది ఎటువైపు వెళ్తుందో ముందుగా తెలుసుకొని ఇతరులకు సమాచారాన్ని ఇస్తున్నారు.

సెమేరు అగ్నిపర్వతం సముద్ర మట్టానికి 3676 మీటర్ల ఎత్తులో ఉంది.  గత జనవరిలోనూ ఇది బద్దలు కావడంతో అప్పుడు చాలా మంది సురక్షిత ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ ఇప్పుడు 13 మంది చనిపోయారు. చాలా మంది గాయపడ్డారు. ఇక్కడున్న 130 యాక్టివ్ వాల్కనోలలో ఇదికూడా ఒకటి. భూకంపాలు ఎక్కువగా రావడంతో ఇక్కడ అగ్ని పర్వాతాలు ఏర్పడ్డాయి. అందుకే దీనిని 'ఫసిపిక్ రింగ్ ఆఫ్ ఫైర్'అని అంటారు.