Begin typing your search above and press return to search.

ఇన్ని కోట్ల డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది?

By:  Tupaki Desk   |   28 Sep 2020 4:30 PM GMT
ఇన్ని కోట్ల డ్రగ్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతోంది?
X
ఇప్పుడంతా డ్రగ్స్ మయంగా మారింది. మత్తు కోసం.. ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఇన్నాళ్లు మద్యం తాగేవారు. ఆ డోసు సరిపోవడం లేదేమో.. ఇప్పుడంతా ‘డ్రగ్స్ ’ వాడుతున్నారు. ముంబైలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంలోనూ డ్రగ్స్ మూలాలు ఇప్పుడు సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆ దెబ్బకు డ్రగ్స్ వాడకం తగ్గిపోతుందని అంతా భావించారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది.

తాజాగా అస్సాంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపింది. కబ్రి అంగ్లాంగ్ జిల్లాలో రూ.25 కోట్ల విలువైన 5 కేజీల హెరాయిన్ పట్టుబడినట్లు డీజీపీ భాస్కర్ జ్యోతి మహంతా వెల్లడించారు. అసోంలో ఈ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడడం ఇదే తొలిసారని డీజీపీ తెలిపారు. వీటిని సరఫరా చేస్తున్న ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఇన్ని కోట్ల డ్రగ్స్ ఇలా విచ్చలవిడిగా తరలిస్తున్నారంటే వాడకం ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

నాగాలాండ్-అసోం సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ అక్రమ రవాణా గుట్టు రట్టైంది. కబ్రి-అగ్లాంగ్ పోలీసులు గత రాత్రి అసోం నాగాలాండ్ సరిహద్దుల్లో 5 కిలోల హెరాయిన్ పట్టుకున్నారు. డ్రగ్స్ స్మగ్లర్లకు ఇది భారీ దెబ్బగా పేర్కొంటున్నారు.

ఈ డ్రగ్స్ దందా నడిపిస్తున్న నిందితుడిని ఇస్మాయిల్ అలీగా గుర్తించారు. అతడి నుంచి 5.05 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్లో దీని విలువ రూ.25 కోట్ల ధర పలుకుతుందని తెలిసింది.

ఇక అస్సాంలోనే కాదు.. మన హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కలకలం రేపింది. ఏపీలోని అరకు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఈ డ్రగ్స్ తీసుకొని బోయిన్ పల్లి, మల్కాజ్ గిరి ఏరియాల్లో తమకు తెలిసిన వ్యక్తులకు డ్రగ్స్ ను ఈ ముఠా విక్రయిస్తున్నట్టు ఎక్సైజ్ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.తాజాగా ఐదుగురిని ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు డ్రగ్స్ కు బానిస అయినట్లు గుర్తించారు. గంజాయితోపాటు హషీన్ ఆయిల్ ను సేవిస్తారని గుర్తించారు. 5 గ్రామాలు హషీస్ ఆయిల్ ను హైదరాబాద్ లో 1500 రూపాయలకు అమ్ముతున్నట్టు విచారణలో తేలింది.

ఇలా అస్సాం అయినా హైదరాబాద్ అయిన ఇన్ని కోట్ల డ్రగ్స్ ఇలా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుండడం కలకలం రేపుతోంది.