అల్లుడు భాగోతం అత్తకే తెలుస్తాయి కదా.. గంటకోసారి డ్రైఫ్రూట్స్

Sat Oct 23 2021 11:00:00 GMT+0530 (India Standard Time)

Lakshmi Parvathi Comments On Tdp party

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు మీద ఘాటు విమర్శలు.. అంతకు మించిన సంచలన ఆరోపణలు చేయటంలో లక్ష్మీ పార్వతి ముందుంటారు. ఏ చిన్న అవకాశం చిక్కినా చంద్రబాబును ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేయటం ఆమెకే చెల్లుతుంది. బాబును విపరీతంగా విమర్శించే వారిలో ఆమె ఒకరు. తాజాగా 36 గంటల దీక్ష చేస్తున్న చంద్రబాబుపై ఆమె వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆయన చేస్తున్న దీక్ష అంతా దొంగగా చేస్తున్నట్లుగా ఆరోపణేలు చేశారు.లక్ష్మీ పార్వతి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. ‘లోపల మా అల్లుడు నిండా దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. పక్కన ఎవ్వరూ లేకుండా మధ్యలో తెర అడ్డు పెట్టారు. మా అల్లుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తినటానికి ఏర్పాటు బాగా చేశారు. మా అల్లుడు గంటకోసారి డ్రై ప్రూట్స్ తినాలి. లేకపోతే అతని ఆరోగ్యం బాగోదు. అల్లుడి బాగోగులు అత్తకే తెలుస్తాయి’’ అంటూ జనాగ్రహ దీక్షలో పాల్గొన్న లక్ష్మీ పార్వతి ఈ తరహా వ్యాఖ్యలు చేశారు.

తన అల్లుడి భాగోతం తనకే తెలుసన్న లక్ష్మీపార్వతి.. పాతికేళ్లుగా తన అల్లుడ్ని చూస్తున్నానని.. అతని ఫీల్టు.. పాట్లు.. అవస్థలు.. అపసోపాలు అన్నీ తనకు తెలసన్నారు. అమరావతి ప్రాణం అంటాడు కానీ ఇల్లు మాత్రం కట్టుకోడన్నారు. కరోనాతో ప్రజలు కష్టాల్లో ఉంటే హైదరాబద్ కు వెళ్లి దాక్కుంటాడని.. బాగా ఉన్న చోటును పాడు చేయటమే మా అల్లుడి పని అని పేర్కొన్నారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో కూడా గెలవరని..అసమర్థుడైన లోకేశ్ కు చంద్రబాబు అవినీతి నేర్పించారన్నారు. ఇప్పుడు కొత్త తిట్లు నేర్పించారన్నారు. ప్రజలకు పనికి వచ్చే కార్యక్రమాలు చేస్తే.. కోర్టుకెళ్లి తమ అల్లుడు స్టేలు తెస్తాడన్నారు. ఆయన జీవితమే అబద్ధాలని.. అబద్ధం అతడితో పుట్టిందా? అబద్ధం కంటే ముందే బాబు పుట్టాడో తెలీయటం లేదని.. అతడితోపాటే అబద్ధం పుట్టి.. పెరిగి.. అతడితోనే పోతుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.