100 ఏళ్ల కాంగ్రెస్ కు నిధుల కొరతనా?

Sat Feb 20 2021 20:00:01 GMT+0530 (IST)

Lack of funding for the 100-year-old Congress?

వందేళ్ల కాంగ్రెస్ కు ఏంటి కష్టకాలం.. దాదాపు 50 ఏళ్లకు పైగా దేశాన్ని ఏలిన పార్టీ నిధుల్లేక అల్లాడుతోంది. 2014 తర్వాత ప్రతిపక్షంలో రెండు దఫాలుగా ఉంటున్న కాంగ్రెస్ పార్టీకి ఈ కరోనా ఎఫెక్ట్ బాగానే పడింది. దానికి తోడు కాంగ్రెస్ పై నమ్మకం లేక ఇప్పుడు నిధులు రాక తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఆ పార్టీ కూరుకుపోయింది.కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు నిధుల కొరత వేధిస్తోంది. ఈ ఆర్థిక సంక్షోభాన్ని అధిగమించడానికి దేశవ్యాప్తంగా తమ పార్టీ ప్రతినిధుల నుంచి విరాళాలు కోరాలని.. నిధులు సమీకరించుకోవాలని మేసేజ్ లు పంపాలన్న నిర్ణయానికి పార్టీ వచ్చింది. దీంతో కాంగ్రెస్ ఎంత గడ్డు పరిస్థితుల్లో ఉందో అర్థం చేసుకోవచ్చు.

గత నెలలో కొన్ని రాష్ట్రాల పార్టీ శాఖలతో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆ పార్టీ నేత రాహుల్ ఈ నిధుల కొరత గురించే ప్రధానంగా నేతల ముందు ప్రస్తావించినట్టు సమాచారం. పార్టీలో నిధుల కొరత గురించి ఆయా సభ్యులకు వివరాలించాలని.. ఆర్థిక వనరుల సేకరణ బాధ్యత తీసుకోవాలని అన్ని రాష్ట్రాల బాధ్యులను సోనియా ఆదేశించినట్టు సమాచారం.త్వరలో జరిగే ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీకి భారీగా నిధులు అవసరం.. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు సాయం చేయాలని పార్టీ పిలుపునిచ్చినట్టు సమాచారం.

ఇక బీజేపీకి మాత్రం దేశవ్యాప్తంగా కార్పొరేట్లు ఇతర వర్గాల నుంచి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలో ఉండడంతో కోట్లలో నిధులు వస్తున్నాయి. బీజేపీకి ఏకంగా 742 కోట్లకు పైగా విరాళాలు అందితే.. కాంగ్రెస్ కు కేవలం 148 కోట్లు మాత్రమే దేశవ్యాప్తంగా అందాయి. దీన్ని బట్టి కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.