Begin typing your search above and press return to search.

అదానీ గ్రూపును ప్రశ్నించడానికి రెడీ అయిన ఎల్.ఐసీ?

By:  Tupaki Desk   |   31 Jan 2023 5:00 AM GMT
అదానీ గ్రూపును ప్రశ్నించడానికి రెడీ అయిన ఎల్.ఐసీ?
X
అమెరికా పరిశోధన సంస్థ హిండెన్ బర్గ్ మన దేశంలోనే అపర కుబేరుడు అయిన గౌతం అదానీ గ్రూపుపై వెలువరించిన నివేదిక ప్రకంపనలు సృష్టిస్తోంది. అదానీ సంపద డొల్లతనాన్ని బయటపెట్టడంతో షేర్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. ఇక అదానీ సంపద కూడా కరిగిపోతోంది.

గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్.. స్టాక్ మార్కెట్లో అవకతవకలకు పాల్పడుతోందని.. అకౌంటింగ్ మోసాలతో షేర్ల విలువను విపరీతంగా పెరిగేలా చేసిందని హిండెన్ బర్గ్ ఇటీవల సంచలన నివేదికను విడుదల చేసింది . రెండేళ్ల పాటు పరిశోధన చేసి మరీ రిపోర్ట్ ను ప్రచురించింది. దీంతో ఇన్వెస్టెర్ల సెంటిమెంట్ దెబ్బతింది. పెద్ద ఎత్తున అదానీ షఏర్ల అమ్మకాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు కూడా కొద్ది రోజులుగా దారుణంగా పతనమవుతున్నాయి. గత రెండు ట్రేడింగ్ సెషన్‌లలో రూ.4 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ తుడిచిపెట్టుకుపోయింది.

అదానీ గ్రూప్ మొత్తం మార్కెట్ క్యాప్ రూ.19.40 లక్షల కోట్ల నుంచి రూ.15.30 లక్షల కోట్లకు పడిపోయింది. శాతం పరంగా కోత 25 శాతం. అదానీ గ్రూప్ ఏసీసీ మరియు అంబుజా సిమెంట్స్‌తో సహా 9 లిస్టెడ్ కంపెనీలను కలిగి ఉంది. ఈ ఒక్కో స్టాక్‌లో సగటు పతనం 20 శాతం. ఎఫ్ అండ్ ఓ విభాగంలో నాలుగు కంపెనీలు ఉన్నాయి. ఆరు కంపెనీలు 20 శాతానికి పైగా పడిపోయాయి; రెండు కంపెనీలకు కేవలం 5 శాతం సర్క్యూట్ మాత్రమే ఉంది.

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఆరోపణలపై అదానీ గ్రూప్ కూడా స్పందించింది. కొట్టిపారేసింది. ఈ అదానీ గ్రూప్ స్పందనను విశ్లేషిస్తున్నామని.. కొద్ది రోజుల్లో అదానీ గ్రూప్ నిర్వాహకులతో మాట్లాడతామని ఇండియాస్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సోమవారం తెలిపింది. అదానీ గ్రూపుతో సమావేశమై పూర్తి సమాచారం తెలుసుకుంటామని వెల్లడించింది.

"ప్రస్తుతం పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. వాస్తవ స్థితి ఏమిటో మాకు తెలియదు. మేము పెద్ద పెట్టుబడిదారులం కాబట్టి సంబంధిత ప్రశ్నలు అడిగే హక్కు మాకు ఉంది. మేము ఖచ్చితంగా వారితో మాట్లాడుతాం" అని ఎల్ఐసీ మేనేజింగ్ డైరెక్టర్ రాజ్ కుమార్ మీడియాకు తెలిపారు. సరైన సమాచారం రాకుంటే మరింత స్పష్టత కోరుతామన్నారు.

కాగా హిండెన్ బర్గ్ ఆరోపణలపై ఇదివరకే అదానీ గ్రూప్ సమాధానమిచ్చింది. దీనిపై అదానీ గ్రూప్ మాట్లాడుతూ 2 సంవత్సరాల పాటు సమగ్ర దర్యాప్తు చేశామని హిండెన్‌బర్గ్ చేసిన వాదనలు అవాస్తవమని పేర్కొంది. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్‌లో, హిండెన్‌బర్గీ లేవనెత్తిన 88 సమస్యలలో, కనీసం 21 కేసులలో కంపెనీ చేసిన బహిర్గతం ద్వారా సమాచారం తీసుకోబడింది అని గ్రూప్ తెలిపింది. 9 కంపెనీలలో, 8 కంపెనీలకు ఆడిటర్లు ఉన్నారు, వారు గ్రూప్ కంపెనీలలో పెద్ద ఆడిటర్లు లేరనే హిండెన్‌బర్గ్ నివేదిక యొక్క వాదనలను తోసిపుచ్చారు. గ్రూప్ కంపెనీలకు 10 ఏజెన్సీలు రేటింగ్ ఇచ్చాయని, వాటిలో మూడు గ్లోబల్ ఏజెన్సీలని చెబుతూ అక్రమాలకు సంబంధించిన ఆరోపణలను కూడా తోసిపుచ్చింది.ఇది భారత్ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడింది.

ఇక దీనిపై హిండెన్ బర్గ్ కూడా బదులిచ్చింది.జాతీయవాదం పేరు చెప్పి మోసాన్ని దాచి ఉంచలేరని స్పష్టం చేసింది. ఈ క్రమంలోనే అదానీ గ్రూపులో భారీ పెట్టుబడులు పెట్టిన ఎల్.ఐసీ రెండు రోజుల్లోనే వేల కోట్ల రూపాయల సంపదను కోల్పోయింది. దీంతో అదానీ గ్రూపును దీనిపై ప్రశ్నించడానికి రెడీ అయ్యింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.