ఎల్జీ పాలిమర్స్ సీఈవో.. 12 మంది అరెస్ట్

Wed Jul 08 2020 11:00:33 GMT+0530 (IST)

LG Polymers CEO, 11 others arrested for Vizag gas leak

విశాఖపట్నంలో జరిగిన గ్యాస్ లీకేజీ దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన ఈ దారుణంలో 12మంది అసువులు బాసారు. అమాయకులెందరు అస్వస్థతకు గురయ్యారు.ఈ ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన అత్యున్నత స్థాయి కమిటీ నివేదిక అందించింది. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే స్టైరీన్ గ్యాస్ లీక్ అయ్యిందని హైపవర్ కమిటీ నిర్ధారించింది. దీంతో ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సంస్థకు చెందిన 12 మందిని అరెస్ట్ చేశారు.ఎల్జీ పాలిమర్స్ సీఈవో బోర్డు డైరెక్టర్లు ఇంజినీర్లు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.

అరెస్ట్ అయిన వారిలో ఎల్జీ పాలిమర్స్ ఎండీ అండ్ సీఈవో సాంకీ జియోంగ్ టెక్నికల్ డైరెక్టర్ డీఎస్ కిమ్ అదనపు డైరెక్టర్ మోహన్ రావు సహా ఇన్ చార్జీలు ప్రొడక్షన్ ఇంజనీర్ విభాగాల వారున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

విశాఖపట్నం రూరల్ పరిధిలోని వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్  కంపెనీ నుంచి మే 7న అర్ధరాత్రి స్టైరీన్ గ్యాస్ లీకైంది. ఈ గ్యాస్ లీక్ తో 12మంది మరణించారు. చాలా మంది అస్వస్థతకు గురయ్యారు. దీనిపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన హైపవర్ కమిటీ నాలుగు వేల పేజీల నివేదికను సీఎంకు అందజేసింది. విశాఖ జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న పర్యావరణ ఇంజినీర్ లక్ష్మీనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఎల్జీ పాలిమర్స్ విస్తరణకు ఆయన నిబంధనలకు విరుద్ధంగా అనుమతులిచ్చాని కమిటీ పేర్కొంది.