Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ తో హైదరాబాద్ మెట్రోకు భారీ దెబ్బ.. ఎంత నష్టమంటే?

By:  Tupaki Desk   |   17 Oct 2020 3:45 AM GMT
లాక్ డౌన్ తో హైదరాబాద్ మెట్రోకు భారీ దెబ్బ.. ఎంత నష్టమంటే?
X
కరోనా వేళ విధించిన లాక్ డౌన్ తో నష్టపోనటువంటి వారే ఉండరు. ఎంత చెట్టుకు అంత గాలి అన్న చందంగా పరిస్థితి మారింది. దగ్గర దగ్గర రూ.16వేల కోట్ల పైచిలుకు భారీ పెట్టుబడితో నిర్మించిన హైదరాబాద్ మెట్రో రైలుకు లాక్ డౌన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. సుదీర్ఘ కాలం పాటు సాగిన లాక్ డౌన్ తో హైదరాబాద్ మెట్రో రైలును నిలిపివేయటం తెలిసిందే. అన్ లాక్ మొదలయ్యాక కూడా మెట్రో రైలును నడపని విషయం తెలిసిందే. ఎట్టకేలకు పచ్చజెండా ఊపినా.. ప్రయాణికుల రద్దీ అంతంత మాత్రంగానే ఉంటోంది.

లాక్ డౌన్ కు ముందు హైదరాబాద్ మెట్రో కు ఆదరణ బాగా ఉండటంతో పాటు.. అంచనాలకు తగ్గట్లే రద్దీ ఉండటంతో.. బ్రేక్ ఈవెన్ పాయింట్ కు త్వరలోనే చేరుకుంటారన్న మాట వినిపించింది. అంతలోనే లాక్ డౌన్ ఆ నష్టానికి కోలుకోలేనంత ఆర్థిక షాకునిచ్చిందట. సాధారణంగా హైదరాబాద్ మెట్రో రైలుకు సంబంధించిన లాభ నష్టాల్ని పెద్దగా బయపెట్టని వైనం తెలిసిందే. అందుకు భిన్నంగా.. భారీగా వచ్చిన నష్టాల నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా తాజా గణాంకాలు బయటకొచ్చినట్లు చెప్పాలి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లకు రూ.916 కోట్ల మేర నష్టం వచ్చినట్లుగా ఎల్ అండ్ ఈ వెల్లడించింది. ఈ ఆర్నెల్ల కాలంలో కేవలం రూ.60 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చినట్లు పేర్కొంది. లాక్ డౌన్ విధించటానికి కాస్త ముందుగా అంటే మార్చి చివర్లో మెట్రో సేవల్ని కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా నిషేధించింది. సెప్టెంబరు ఏడున అన్ లాక్ 4లో భాగంగా మెట్రో సేవల్ని దేశ వ్యాప్తంగా పునరుద్ధరించారు.

అయినప్పటికీ మెట్రో సేవల్ని అంతగా ఉపయోగించుకోని పరిస్థితి నెలకొంది. పరిస్థితి మెరుగు కావాలంటే వ్యాక్సిన్ వస్తే తప్పించి.. సాధారణ పరిస్థితులు నెలకొనవన్న మాట వినిపిస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో హైదరాబాద్ మెట్రో రూ.383 కోట్ల నష్టాన్ని చవిచూస్తే.. కొత్త ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆర్నెల్లలో అంతకు మించి అన్నట్లుగా నష్టాల్ని మూటగట్టుకుంది. దీంతో.. మెట్రోలో మేజర్ స్టేక్ హోల్డర్ అయిన ఎల్ అండ్ టీ కేసీఆర్ సర్కారు నుంచి ఉపశమనం కోరుకుంటోంది. లాక్ డౌన్ కాలానికి సంబంధించి.. తాము చేసుకున్న ఒప్పందంలో భాగంగా రాయితీ వ్యవధిని పెంచమని కోరుతోంది. మరి.. వారి విన్నపంపై సీఎం కేసీఆర్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.