Begin typing your search above and press return to search.

కువైట్ సంచలన నిర్ణయం ..ఇకపై మనవారికి జీతం అలా ఇవ్వరట !

By:  Tupaki Desk   |   23 Oct 2021 3:30 AM
కువైట్ సంచలన నిర్ణయం ..ఇకపై మనవారికి జీతం అలా ఇవ్వరట !
X
కువైట్ .. ఈ దేశానికి చాలామంది పని నిమిత్తం వలస వెళ్తుంటారు. ఉపాధి కోసం ఇండియా నుంచి వెళ్లే మహిళలు ఎక్కువగా ఇంట్లో పనిమనుషులుగానే చేరుతుంటారు. ఈ క్రమంలో కొందరు కేటుగాళ్లు వారిని మోసం చేయడం, పనికి కుదుర్చుకున్న యజమాని కాంట్రాక్ట్ పరిమితి, జీతం విషయంలో మాటమార్చడం వంటివి జరుగుతుంటాయి. దాంతో ఉపాధి కోసం వెళ్లినవారు వేరే దిక్కులేక వారి మోసాన్ని భరిస్తూ అక్కడే ఉండడం జరుగుతుంది. అందుకే ఇకపై డొమెస్టిక్ వర్కర్ల నియామకాల విషయంలో ఇలాంటివి జరగకుండా తాజాగా భారత్, కువైత్‌‌ మధ్య కీలక ఒప్పందం కుదిరిన్నట్లు తెలుస్తోంది.

దీనికి ఆ దేశ కేబినేట్ కూడా ఆమోదం తెలిపిందని సమాచారం. ఈ ఒప్పందం ప్రకారం భారతీయ మహిళలను పనిమనుషులుగా నియమించుకునేందుకు కొన్ని కొత్త నిబంధనలు తెరపైకి వచ్చాయని అక్కడి స్థానిక మీడియా వెల్లడించింది. వీటిలో ప్రధానంగా మహిళల వయసు. 30 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్కులను మాత్రమే నియమించుకోవాలి. 30 కంటే తక్కువ వయసు ఉన్నవారిని ఎట్టిపరిస్థితిలో రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు నియామకాలు చేపట్టకూడదు. అలాగే జీతం కూడా నెలకు వంద కువైటీ దీనార్లకు(సుమారు రూ.25వేలు) తక్కువ ఇవ్వరాదు. అది కూడా నగదు రూపంలో చేతికి ఇవ్వకూడదు. యజమానినే పనిమనిషి పేరు మీద తప్పకుండా ఓ బ్యాంకు ఖాతా తెరిపించి అందులో వేయాలి.

పనికి కుదుర్చుకున్నవారి కాంట్రాక్ట్ ముగిసేవరకు ఇదే పద్దతి కొనసాగాలి. అంతేగాక ఎంప్లాయిమెంట్ కాంట్రాక్ట్ అప్రూవ్ చేసేందుకు రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలు తప్పనిసరిగా భారత ఎంబసీ అనుమతి తీసుకోవాలి. ఇదిలాఉంటే.. వయసు విషయంలో షరతు అనేది భారత్ నుంచి కొత్త డొమెస్టిక్ వర్కర్ల నియామకాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని కువైత్ యూనియన్ ఆఫ్ డొమెస్టిక్ లేబర్ ఆఫీస్ చైర్పర్సన్ ఖలేద్ అల్ దఖ్‌ నన్ మీడియాతో అన్నారు. ఇంకా చెప్పాలంటే ఇకపై 30 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న భారతీయ మహిళలకు కువైత్ వీసాలు జారీ చేయకూడదని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, కేవలం 10 భారతీయ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలకు మాత్రమే డొమెస్టిక్ వర్కర్ల నియామకాలను చేపట్టే అవకాశం ఇచ్చినట్లు అక్కడి ఓ ప్రముఖ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది.