Begin typing your search above and press return to search.

కుప్పం.. నీదా నాదా సొంతం... ?

By:  Tupaki Desk   |   18 Oct 2021 1:30 PM GMT
కుప్పం.. నీదా నాదా సొంతం... ?
X
ఏపీలో మరోమారు ఎన్నికల నగారా మోగనుంది. అప్పట్లో వాయిదా పడిన ఆగిన మునిసిపాలిటీలకు ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. వీటికి సంబంధిచిన నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల కానుంది అంటున్నారు. దాదాపుగా పన్నెండు మునిసిపాలిటీలకు ఒక కార్పోరేషన్ కి ఈసారి ఎన్నికలు జరగనున్నాయి. అయితే వీటన్నిటిలో రాజకీయంగా హాట్ హాట్ అయిన ప్లేస్ ఒకటి ఉంది. అదే కుప్పం. కుప్పం మునిసిపాలిటీకి తొలిసారిగా ఎన్నికలు జరగనున్నాయి. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక  కుప్పం ని మునిసిపాలిటీగా చేశారు. అది ఆ ప్రాంతవాసుల చిరకాల డిమాండ్ కూడా.

ఆ విధంగా జనం మనసు గెలుచుకుని మరీ కుప్పానికి ప్రమోషన్ ఇచ్చిన వైసీపీ ఈ ఎన్నికల్లో గెలిచి మొదటి పాలన తామే అక్కడ సాగించాలనుకుంటోంది. ఇంతకీ ఈ కుప్పం ఎవరిదీ అంటే రాజకీయ గండర గండడు, ఫార్టీ యియర్స్ ఇండస్ట్రీ చంద్రబాబుది. ఆయన మూడున్నర దశాబ్దాలుగా కుప్పం కోట మీద జెండాను ఎగరవేస్తున్నారు. అయితే 2109 ఎన్నికలు మాత్రం కొంత దెబ్బ తీశాయి. మెజారిటీ సగానికి సగం తగ్గిపోయింది. ఈ మధ్యన జరిగిన పంచాయతీలు, పరిషత్తు ఎన్నికల్లోనూ కుప్పంలో అధికార పార్టీ వైసీపీ విజయబావుటా ఎగరేసింది.

ఈ నేపధ్యంలో కుప్పం మునిసిపాలిటీకి జరిగే ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి. ఎవరికి కుప్పం సొంతం అవుతుంది అన్న చర్చ అయితే మొదలైంది. కుప్పం ఫలితాలు కనుక అధికార పార్టీకి అనుకూలంగా వస్తే మొత్తానికి మొత్తం కుప్పం టీడీపీ నుంచి చంద్రబాబు నుంచి చేజారినట్లే అనుకోవాలి. అదే ఇపుడు టీడీపీని కూడా బాగా కలవరపెడుతోంది. ఒక విధంగా బాబుకు ఇజ్జత్ మే సవాల్ గా కుప్పం మునిసిపాలిటీ ఎన్నికలను చూడాలని అంటున్నారు.

కుప్పంలో వైసీపీ గెలవకపోయినా ఫరవాలేదు. ఎందుకంటే అది వారి సొంత గడ్డ కాదు, చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్నది కాబట్టి పోయింది అనుకుంటారు. అదే కుప్పాన్ని గెలిస్తే మాత్రం టీడీపీని, చంద్రబాబుని ఏకంగా గెలిచేసినట్లే అని వైసీపీ సంబరాలు చేసుకుంటుంది. అంతే కాదు, టీడీపీని ఒక్క లెక్కన  గేలిచేస్తుంది. ఇక  ఇపుడు చూస్తే అన్ని ఎన్నికలలోనూ కుప్పం లో తొడగొట్టి గెలిచిన వైసీపీకి ఈ మునిసిపాలిటీ గెలుపు కచ్చితంగా కావాల్సిందే అంటున్నారు. ఈ దెబ్బతో చంద్రబాబుని నైతికంగా కృంగదీయగలమని కూడా వైసీపీ నేతలు భావిస్తున్నారు. దాంతో చాన్నాళ్ళుగా కుప్పం మునిసిపాలిటీ విషయంలో గట్టిగానే దూకుడు చేస్తున్నారు.

ఇక చంద్రబాబుకు మాత్రం కుప్పం చాలా ప్రతిష్టగా తీసుకోవాల్సిందే. కుప్పం మునిసిపాలిటీ అంటే నియోజకవర్గానికి  ముఖ ద్వారం. అలాంటి చోట కనుక ఓడితే మాత్రం టీడీపీకి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఇలా చంద్రబాబుకు అగ్ని పరీక్షంగా కుప్పం మారబోతోంది అంటున్నారు. నీదా నాదా కుప్పం అంటూ అపుడే అటు వైసీపీ ఇటు టీడీపీ మోహరించేశాయి.

ఎన్నికల తేదీ కనుక ఖరారు అయితే మాత్రం చంద్రబాబు కూడా పర్యటిస్తారు అంటున్నారు. కుప్పం కిరీటం ఎవరి నెత్తిన పెడుతుందో చూడాల్సిందే.