సిరిసిల్లను కోనసీమతో పోల్చటమా? ప్రాబ్లం అవుతుందేమో కేటీఆర్

Thu Jun 17 2021 09:01:47 GMT+0530 (IST)

Ktr Praises Konaseema

విడిపోయి కలిసి ఉందాం..సోదరులుగా సమస్యలు పరిష్కరించుకుందామని చెబుతూ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన ఏడేళ్లకు కూడా ఏపీ మీద విమర్శనాస్త్రాల్ని సంధించటం.. తెలంగాణను దెబ్బ తీసింది ఏపీ పాలకులేనని విరుచుకుపడటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికి చేస్తూనే ఉంటారు. నిజానికి ఈ రోజున ఏపీ ఆర్థిక పరిస్థితితో పోల్చినప్పుడు తెలంగాణ పరిస్థితి చాలా బెటర్ గా ఉంది. విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి ఎలాంటి దన్ను లభించకపోవటంతో ఒక పెద్ద ఇబ్బందిగా మారింది.తెలంగాణలోని ప్రతి లోపానికి ఏపీని ఏదోలా ఎత్తి చూపించే టీఆర్ఎస్ నేతలు.. ఏపీ విషయంలో తమ వైఖరిని స్పష్టం చేస్తూనే ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఏపీలోని ఒక ప్రాంతం గొప్పతనాన్ని గుర్తించినట్లుగా ఆయన మాటలు ఉన్నాయి. అదే సమయంలో.. తెలంగాణలో మారిన పరిస్థితిని చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. ఇంతకూ జరిగిందేమంటే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.15 కోట్లతో నిర్మించిన 261 డబుల్ బెడ్రూం ఇళ్లను ప్రారంభించి.. లబ్థిదారులతో కలిసి గ్రహఫ్రవేశం చేశారు. లబ్థిదారులతో కలిసి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సిరిసిల్ల జిల్లా కాళేశ్వరం జలాలతో మరో కోనసీమగా మారనున్నట్లు చెప్పారు. దేశంలో మరెక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణకు ఏపీ కారణంగా నష్టం జరిగిందని తరచూ బద్నాం చేయటం తెలిసిందే. అలాంటిది.. ఏపీలోని కోనసీమను పొగిడేలా పోలిక ప్రస్తావించటం కేటీఆర్ కు ప్రాబ్లం కాదా? అన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.