కేసుల చిట్టా బండి దగ్గర ఉందన్న మాటకు కేటీఆర్ జవాబిదే

Sat Oct 23 2021 14:00:01 GMT+0530 (IST)

Ktr Fire On Opposition Parties

వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవటం.. అంతే వ్యూహాత్మకంగా అమలు చేయటంలో టీఆర్ఎస్ పార్టీ ముందు ఉంటుంది. తాము చేసే ప్రతి పనికి ఒక లెక్క ఉంటుందన్నట్లుగా ఆ పార్టీ తీరు ఉంటుంది. పార్టీ ప్లీనరీ సమావేశాన్ని సోమవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి.భారీగా చేపడుతున్న ప్లీనరీ వేళ.. ప్రముఖ మీడియా సంస్థలకు లెక్క  కట్టి మరీ ఇంటర్వ్యూలు ఇవ్వటం ద్వారా.. తమ వాయిస్ ను ప్రజలకు చేరవేసేలా ప్లాన చేశారు కేటీఆర్. ఇలా ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటి నుంచి తరచూ వినిపించే మాటను ప్రశ్నగా సంధించారు. కేసీఆర్ అవినీతి చిట్టా తమ వద్ద ఉందన్న బండి సంజయ్ మాటల్ని ప్రస్తావించిన వేళ.. కేటీఆర్ ఘాటుగా రియాక్టు అయ్యారు.

‘‘ఏ కేసుల చిట్టా? ఈటల రాజేందర్ అక్రమ కేసుల చిట్టానా? తీన్మార్ మల్లన్న అక్రమ కేసుల చిట్టానా? ధర్మపురి అర్వింద్ ఫేక్ డిగ్రీ కేసుల చిట్టానా? నువ్వేమైనా చిత్రగుప్తుడివా చిట్టా రాసుకుంటూ కూర్చోడానికి? పైనున్నోడో యమధర్మరాజా? వాళ్లు ఎట్లా ప్రవర్తిస్తున్నరో ఈడీలను సీబీఐలని ఎట్లా వాడుకుంటున్నరో దేశం మొత్తం చూస్తున్నది. ఇట్లా ఎగిరెగిరి పడ్డవారిని చూసి భయపడేటోడు ఎవడున్నడు ఇక్కడ? మేం తప్పులు చేసి ఉంటే ఇన్ని రోజులు ప్రజల్లో ఉంటామా?’’ అంటూ విరుచుకుపడ్డారు. మరి.. ఈ వ్యాఖ్యలకు బండి సంజయ్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.