ఎవడి డప్పు వాళ్లు వాయించుకోవాలి.. అది కూడా కేటీఆర్ మాదిరి!

Mon Jan 17 2022 10:01:08 GMT+0530 (IST)

Ktr About Trs Party

మేం అది చేశాం..  ఇది చేశాం.. అంత చేశాం.. ఇంత చేశాం.. లాంటి మాటలన్ని పాత పద్దతి. మన గొప్పను మనమే చెప్పుకుంటే ఏం బాగుంటుంది. అందునా రాజకీయాల్లో ఇలాంటి ఎత్తులు చాలా పాతవిగా మారాయి. మారిన రాజకీయానికి తగ్గట్లు.. సరికొత్త ఐడియాలతో అందరి మనసుల్ని దోచుకునేలా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాంటి టాలెంట్ తనలో టన్నుల కొద్దీ ఉందన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఎప్పటికప్పుడు ఫ్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. సోషల్ మీడియాలో ఆయన ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలంగాణలో తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని చెప్పుకునేందుకు.. ప్రచారం చేసుకోవటానికి వీలుగా ఆయన.. విభిన్న మార్గంలో నడుస్తున్నారు.తాజాగా అమెజాన్ క్యాంపస్ భవన చిత్రాన్ని మంత్రి కేటీఆర్ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. ప్రపంచంలోనే అతి పెద్ద అమెజాన్ క్యాంపస్ ఎక్కడ ఉంది? అని ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన నెటిజన్లు హైదరాబాద్ లో అని పేర్కొన్నారు. అమెజాన్ అమెరికా వెలుపల అతి పెద్ద క్యాంపస్ హైదరాబాద్ లోనే ఉందన్న విషయాన్ని తన సండే క్విజ్ ద్వారా నెటిజన్ల చేత చెప్పించుకోవటం గమనార్హం. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్నితమకు తాము చెప్పుకోకుండా.. ప్రజల్ని అందులో భాగస్వామ్యం చేసేలా కేటీఆర్ సోషల్ మీడియాను తెలివిగా వాడుతున్నారని చెప్పాలి.

అమెరికా ఈ -కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రపంచంలోనే అతి పెద్ద క్యాంపస్ భవనాన్ని హైదరాబాద్ లో 2019లో ప్రారంభించింది. దీన్ని నానక్ రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో 10 ఎకరాల స్థలంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలతో నిర్మించారు. తొలుత తొమ్మిది వేల మంది ఉద్యోగులతో మొదలైన ఈ క్యాంపస్ లో ఇప్పుడు ఏకంగా 15 వేల మంది ఉద్యోగులు పని చేస్తుండటం గమనార్హం.

అమెరికా బయట అమెజాన్ ఏర్పాటు చేసిన అతి పెద్ద ప్రాంగణం ఇదే కావటం గమనార్హం. 15 అంతస్తుల ఈ భారీ నిర్మాణంలో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో పార్కింగ్ ప్రదేశం.. మరో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉద్యోగులు పని చేసే కార్యాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. అమెజాన్ కు చెందిన వివిధ గ్లోబల్ బిజినెస్.. టెక్నాలజీ టీమ్స్.. బ్యాకెండ్ కార్యకలాపాలను ఇక్కడ నుంచి ఉద్యోగులు నిర్వహించనున్నారు.

కేసీఆర్ ప్రభుత్వం సాధించిన విజయాల్లో ఐటీ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవటంతో పాటు.. మరో స్థాయికి తీసుకెళ్లేలా వ్యవహరించారని చెప్పాలి. టెస్లా కార్ల అధినేత ఎలాన్ మాస్క్ ను తెలంగాణ రాష్ట్రానికి రావాలని కోరిన కేటీఆర్.. అమెజాన్ క్యాంపస్ ఫోటోను పెట్టటం వ్యూహాత్మకంగా చెబుతున్నారు.

టెస్లాను తమ రాష్ట్రానికి రావాలంటూ ఇప్పటికే పలు రాష్ట్ర ప్రభుత్వాలు కోరుతున్న వేళ.. ఆ రేసులో తమ రేంజ్ చూపేలా తాజా క్విజ్ క్వశ్చన్ ను కేటీఆర్  అడిగారని చెప్పక తప్పదు. ఇదంతా చూసినప్పుడు ఎవరి డప్పు వారు కాకుండా.. పక్కనోళ్ల చేత ఎలా వాయించాలన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ నుంచి నేర్చుకోవాల్సిందే.