Begin typing your search above and press return to search.

రైతుల అరెస్టు...మంత్రులపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!

By:  Tupaki Desk   |   22 Sep 2020 5:40 PM GMT
రైతుల అరెస్టు...మంత్రులపై వైసీపీ ఎమ్మెల్యే ఆగ్రహం!
X
సాధారణంగా తమ పార్టీకి చెందిన నేతలు చేసిన పనికి తానా అంటే తందానా అనే నాయకులు చాలామంది ఉంటారు. తమపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను తోటి ఎమ్మెల్యే విమర్శించడం, వారికి హితవులు పలకడం వంటివి చేయరు. ఇక, మంత్రులను విమర్శించేంత సాహసం...సలహాలు, హితవులు పలికేంత ధైర్యం ఎమ్మెల్యేలకు దాదాపుగా ఉండదు. అయితే, తాజాగా వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్....తన జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులపై చేసిన కామెంట్లు ఇపుడు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు జిల్లా సంగంలో మద్దతు ధర కోసం రోడ్డెక్కిన రైతులపై కేసులు పెట్టారని, ఆ కేసులు ఎత్తివేసేలా జిల్లా ఎస్పీతో మంత్రులు అనిల్ కుమార్, గౌతమ్ రెడ్డి చొరవ తీసుకోవాలని ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. మంత్రిగారి నియోజకవర్గంలో రైతులపై కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించిన ప్రసన్న కుమార్, చేతనైతే ధాన్యం కొనని మిల్లర్లపైనా, దళారులపైనా కేసులు పెట్టాలని పోలీసులపై అసహనం వ్యక్తం చేశారు.

గౌతమ్, అనిల్ ... ఇది మంచి పద్ధతి కాదు....మీరు జోక్యం చేసుకొని ఎస్పీగారితో మాట్లాడి కేసులు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోండి...అని ప్రసన్నకుమార్ ఓ సమావేశం సందర్భంగా చెప్పారు. ఓవైపు రాష్ట్రంలో రైతు ముఖంలో ఆనందం కనిపించాలని సీఎం జగన్ తంటాలు పడుతున్నారని, ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువచ్చే పనులు చేయవద్దని హితవు పలికారు. రూ.15,590 మద్దతు ధరను జగన్ ప్రకటించారని, ఆ ధరను మిల్లర్లు ఇవ్వక, ధాన్యం చెడిపోతుంటే రైతులు ఎంతో ఆవేదనతో రోడ్డు మీద కూర్చున్నారని అన్నారు. దానికే కేసులు పెట్టి అరెస్ట్ చేయడం మంచి పద్ధతి కాదని, పద్ధతులు మార్చుకోవాలని అన్నారు. రైతులను మోసం చేస్తున్న దళారులు, మిల్లర్లపై కేసులు పెట్టాలని ప్రసన్నకుమార్ అన్నారు. నెల్లూరులో రైస్ మిల్లర్ల మాఫియా ఉందని, జాగ్రత్తగా ఉండాలని మిల్లర్లకు వార్నింగ్ ఇచ్చారు ప్రసన్నకుమార్. సొంతపార్టీకి చెందిన మంత్రులపైన ప్రసన్న కుమార్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అయినా రైతుల కోసం నిష్పక్షపాతంగా మాట్లాడారని, మంచి మాట చెప్పారని నెటిజన్లు అంటున్నారు.