Begin typing your search above and press return to search.

తనకు వైసీపీలో కష్టాలు మొదలైంది ఎప్పుడో ఓపెన్ అయిన కోటంరెడ్డి

By:  Tupaki Desk   |   6 Feb 2023 10:03 AM GMT
తనకు వైసీపీలో కష్టాలు మొదలైంది ఎప్పుడో ఓపెన్ అయిన కోటంరెడ్డి
X
ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.. వైసీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. పార్టీ అధినాయకత్వం మీద కినుకుతో పాటు.. తనను అనుమానించిన వైనంపై హర్ట్ అయిన ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధం కావటమే కాదు.. చంద్రబాబు చెబితే వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తానని పేర్కొన్నారు. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాల్ని చెప్పుకొచ్చారు. ఒకప్పుడు వైసీపీకి.. జగన్ కు వీరాభిమానిగా ఉన్న కోటంరెడ్డి.. ఇప్పుడు ఇలా ఎందుకు మారారు? అన్న ప్రశ్నతో పాటు.. ఆ పరిస్థితికి కారణం ఏమిటి? అన్నది సందేహంగా మారింది.

ఇదే విషయాన్ని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని అడిగినప్పుడు ఆయన ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. ఏపీ రాజధాని అమరావతి రైతులకు కష్టాలు 2020 నుంచి ప్రారంభమైతే.. తనకు మాత్రం అమరావతి రైతుల్ని పరామర్శించటంతోనే మొదలైనట్లుగా పేర్కొన్నారు. వరదల సమయంలో పాదయాత్ర చేస్తున్న అమరావతి రైతులకు సాయం చేసినందుకే సీఎం జగన్ కు కోపం వచ్చిందన్నారు. ఇంతకు మించి మరే కారణం తనకు కనిపించటం లేదని స్పష్టం చేశారు.

నేనే జగన్.. జగనే నేను అన్నట్లుగా తాను ప్రేమించానని.. అలాంటి తన ఫోన్ ట్యాపింగ్ చేస్తారని అస్సలు ఊహించలేదన్నారు. మొదట్లో తన ఫోన్ ట్యాప్ చేశారంటే నమ్మలేదని.. కానీ తనకు ఇంటెలిజెన్స్ చీఫ్ రామాంజనేయులు ఫోన్ చేసి ఆడియో పంపిన తర్వాతే తనకు అసలు విషయం అర్థమైందన్నారు.

నమ్మకం లేని చోట ఉండకూడదని.. ఉండాలని ప్రయత్నించినా విధి లేని పరిస్థితిని తీసుకొచ్చారన్నారు. అధికారం ఇంకో పదిహేను నెలలు ఉందని.. ఆఖరిలో వెళ్లొచ్చని స్నేహితులు కూడా చెప్పారని.. అయినా తనకు నటించటం చేతకాదన్నారు. తన మీద విశ్వాసం సన్నగిల్లిన తర్వాత ఉండటం అవసరం లేదని భావించినట్లు పేర్కొన్నారు.

''జగన్ కు నచ్చని పని ఏదైనా చేశానంటే అది జీవితంలో ఒక్కటే. అది కూడా కావాలని చేసింది కాదు. మానవత్వంతో చేసింది. అమరావతి రైతులు యాత్ర చేస్తూ జిల్లాలోకి వచ్చిన సమయంలో.. నా నియోజకవర్గంలో ప్రజలు వరద ప్రాంతాల్లో చిక్కుకున్న సమయంలో నేను పర్యటిస్తున్నా. ఆ దారిలోనే అమరావతి రైతులు ఉంటే వారి వద్దకు వెళ్లి పరిచయం చేసుకోవాలనుకున్నా. అయితే.. వారు నన్ను గుర్తుపట్టి పలుకరించారు. వారు విడిది చేసిన బిల్డింగ్ కు వెళితే అక్కడున్న మహిళలు నన్ను చూసి కన్నీళ్లు పెట్టుకన్నారు. నేను సున్నిత మనస్కుడ్ని. వారి బాధ చూసి కళ్లు చెమర్చాయి'' అని అప్పటి సంగతుల్ని చెప్పుకొచ్చారు.

''నన్ను వాళ్లు జై అమరావతి అని నినాదం చేయాలని కోరారు. అప్పుడు వారికి చాలా స్పష్టంగా చెప్పాను. నేను వచ్చింది మీ ఉద్యమానికి మద్దతు పలకటానికి కాదు. ఈ వరదలో మీరు ఉండలేరు. మీకు మొయిన్ రోడ్ లో ఉన్న మండపంలో కావాల్సిన ఏర్పాట్లు చేస్తానని చెప్పా. వారిని చూసిన తర్వాత వారిని పెయిడ్ ఆర్టిస్టులు అని ఎవరూ అనుకోరని కొన్ని వేల మందికి చెప్పా. .ఒక ప్రభుత్వం తీసుకున్న చరిత్రత్మక నిర్ణయాన్ని.. తమ త్యాగాన్ని మరో ప్రభుత్వం గుర్తించకపోవటంతో వాళ్లు దగా పడి.. కడుపు మండి ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలూ ఉన్నారు. అదే జగన్ కు కోపం తెప్పించింది'' అంటూ అప్పట్లో ఏం జరిగిందో చెప్పారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.