Begin typing your search above and press return to search.

సదా స్మరామీ : అంబేద్కర్ కోన సీమ జిల్లాగా మార్పు

By:  Tupaki Desk   |   18 May 2022 1:13 PM GMT
సదా స్మరామీ : అంబేద్కర్ కోన సీమ జిల్లాగా మార్పు
X
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించారు. అందులో ఒకటిగా కోనసీమ జిల్లాను ఏర్పాటు చేశారు. అమలాపురం జిల్లా కేంద్రంగా దానిని ఏర్పాటు చేశారు. అయితే ఈ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని విజ్ఞప్తులు పెద్ద ఎత్తున వచ్చాయి. దాంతో ప్రభుత్వం అన్నీ ఆలోచించిన మీదట తాజాగా కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఇక మీదట కోనసీమ జిల్లాను అంబేద్కర్ జిల్లాగా మారుస్తూ నిర్ణయించారు. ఈ నిర్ణయం పట్ల జిల్లా వాసులలో హర్షం వ్యక్తం అవుతోంది. ఈ రకంగా రాజ్యాంగ నిర్మాత పేరుని పెట్టాని కాపునాడు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇప్పటికి రెండు సార్లు జగన్ కి లేఖ రాశారు.

అదే విధంగా వివిధ స్వచ్చంద సంస్థలు, సామాజిక సంస్థలు కూడా దీని మీద ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మరో వైపు చూస్తే ఏపీలో ఎన్టీయార్, వైఎస్సార్ పేరుతో జిల్లాలు ఉన్నాయి. అలాగే ప్రకాశం, పొట్టి శ్రీరాములు పేరిట కూడా జిల్లాలు ఉన్నాయి. అదే సమయంలో దేశంలోని అణగారిన వర్గాలకు పెద్ద దిక్కుగా ఆపద్బాంధవుడిగా ఉన్న అంబేద్కర్ పేరు ఒక జిల్లాకు అయినా పెట్టాలన్న డిమాండ్ మొదటి నుంచి ఉంది.

దాంతో అన్నీ ఆలోచించిన మీదటనే జగన్ సర్కార్ ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది అంటున్నారు. ఈ జిల్లాలో అత్యధికంగా ఎస్సీ జనాభా ఉంది. వారి మనోభావాలను కూడా గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయించింది అంటున్నారు. ఇక ఈ నిర్ణయం పట్ల వైసీపీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సముచితమైన నిర్ణయంగా దీన్ని కోనసీమ జిల్లా వాసులు స్వాగతిస్తున్నారు.