Begin typing your search above and press return to search.

కోహ్లి కమాల్ కాదు.. అంతా గోల్ మాల్ .. మళ్లీ డకౌట్

By:  Tupaki Desk   |   11 Feb 2022 2:30 PM GMT
కోహ్లి కమాల్ కాదు.. అంతా గోల్ మాల్ .. మళ్లీ డకౌట్
X
టీమిండియా స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లికేమైంది...? నిపుణులు చెప్పినట్టు తను కంఫర్ట్ మిస్ అయ్యాడా? లేదా ఫామ్ లో ఉన్నప్పటికీ కాలం కలిసి రావడం లేదా? తన బ్యాట్ నుంచి భారీ స్కోరు మళ్లీ ఎన్నడు..? పోనీ కనీసం ఓ ప్రభావ వంతమైన ఇన్నింగ్ ఎన్నడు? మళ్లీ మునుపటి కోహ్లిని చూడగలమా? లేదా ఆ కోహ్లి కరిష్మా అంతా గతమేనా? విరాట్ ఓ సాధారణ బ్యాట్స్ మన్ గా మిగిలి

పోనున్నాడా? కుర్రాళ్లు కుమ్మేస్తుంటే.. కోహ్లి కమాల్ ఎక్కడికిపోయింది? ఇప్పుడీ ప్రశ్నలన్నీ సగటు క్రికెట్ అభిమానిని వేధిస్తున్నాయి.

మూడు నెలల్లోనే..

మూడు నెలల క్రితం వరకు భారత క్రికెట్ లో కోహ్లికి తిరుగులేదు. కానీ, టి20 కెప్టెన్సీ వదులుకోవడం, ఆపై వన్డే సారథ్యం నుంచి తప్పించడం, ఆ సందర్భంగా చెలరేగిన వివాదాలు, వ్యాఖ్యలు, ప్రతి వ్యాఖ్యలు.. బీసీసీఐ జోక్యం.. చివరకు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ కు దూరంగా ఉంటాడన్న వార్తలు.. అక్కడ తొలి టెస్టు నెగ్గినా.. రెండు టెస్టులు ఓడి సిరీస్ కోల్పోవడం.. ఆపై టెస్టు కెప్టెన్సీ కి కోహ్లి వీడ్కోలు పలకడం.. ఇదంతా ఓ కలలా సాగిపోయింది. వెనక్కు తిరిగి చూస్తే గత రెండు దశాబ్దాల్లో టీమిండియాలో ఎన్నడూ లేనంతగా మార్పులు గత మూడు నెలల్లోనే జరిగాయి.

ఫామ్ లో లేడా? అసలు ఆటలోనే లేడా?

51, 0, 65, 8, 18, 0 ఇవీ గత ఆరు వన్డేల్లో కోహ్లి స్కోర్లు. ఈ రోజు వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో.. ఓపెనర్లు విఫలమై కీలక సందర్భంలో వచ్చిన కోహ్లి రెండే బంతులాడి వికెట్ ఇచ్చేశాడు. పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. గత 5 వన్డేల్లో అతడికిది రెండో డక్. మరీ ముఖ్యంగా సొంతగడ్డపై వెస్టిండీస్ సిరీస్ లో కోహ్లి ఆటతీరు పూర్తిగా నిరాశపర్చింది. మూడు మ్యాచ్ ల్లో అతడు చేసింది 26 పరుగులేనంటే నమ్మశక్యంగా లేదు. ఈ మూడు మ్యాచ్ ల్లోనూ కీలక సందర్భాల్లో అతడు అవుటయ్యాడు. దీన్నిబట్టి కోహ్లి కెరీర్ పై ఒకప్పటిలా 200 శాతం శ్రద్ధపెట్టాలని స్పష్టమవుతోంది.

ఏమైంది ఆ తీవ్రత..?

కోహ్లి అంటే.. రగిలే కసి.. మైదానంలో చిరుత. కానీ, ఎందుకనే అలాంటి కోహ్లి ఇప్పుడు కనిపించడం లేదు. ముఖ్యంగా కెప్టెన్సీ వదులుకున్నాక అతడి కరిష్మా కనిపించడం లేదు. నాటి అద్భుత బ్యాట్స్ మన్ కనుమరుగయ్యాడా? అని అనిపిస్తోంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా క్రీజులో నిలిచి భారీ స్కోర్లు కొట్టే, ఛేజింగ్ దుమ్ము దులిపే తన ప్రతిభ అంతా ఎక్కడికి పోయింది. చూస్తుంటే.. మైదానం

బయటి పరిస్థితులు తనను బాగా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. దక్షిణాఫ్రికా,వెస్టిండీస్ వన్డే సిరీస్ లను తీసుకుంటే 6 ఇన్నింగ్స్ లలో అతడు చేసింది 142 పరుగులే. లోయరార్డర్ బ్యాట్స్ మన్ కంటే సాదాసీదా ప్రదర్శన ఇది. అన్నటికి మించి టన్నుల కొద్దీ పరుగులు చేసిన సమయంలో కోహ్లి బ్యాచిలర్. ఇప్పడు అతడికి కుటుంబం ఏర్పడింది. దాని మీద కూడా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. కాబట్టి తన ఏకాగ్రత చెదరకుండా చూసుకోవాలి.

సమీక్షించుకోవాల్సిందే

నానాటికీ తన ఆటతీరు పడిపోతుండడంపై కోహ్లి తక్షణమే సమీక్షించుకోవాలి. లేదంటే మరో మూడు, నాలుగు సిరీస్ ల తర్వాత అయినా.. ఓ రహానే, ఓ పుజారా పరిస్థితి తనకు ఎదురవ్వొచ్చు. జట్టులో చోటు ఎవరికీ శాశ్వతం కాదు.. ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ, చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ కూడా ఇలా వేటు పడినవారే. కాబట్టి కోహ్లి ఇప్పటికిప్పుడు చేయాల్సింది సమీక్ష. ఇందుకు అవసరమైతే ఒకటీ,రెండు సిరీస్ లు విశ్రాంతి తీసుకుని అయినా.. తాజాగా మైదానంలోకి దిగడం ఉత్తమం.