Begin typing your search above and press return to search.

2024లోనే కాదు, 2029, 2034 ఎన్నిక‌ల్లో అయినా!

By:  Tupaki Desk   |   24 Jan 2022 5:19 PM GMT
2024లోనే కాదు, 2029, 2034 ఎన్నిక‌ల్లో అయినా!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఆయ‌న కుమారుడు నారా లోకేష్ స‌హా పార్టీ కీల‌క నేత‌ల‌పై మంత్రి కొడాలి నాని తీవ్ర‌స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి రాజకీయ సమాధేన‌ని అన్నారు. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రతిపక్ష నాయకుడు గా చంద్రబాబు ఉండటం దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. మంత్రి పదవి నుంచి తనను తప్పించేందుకు కుట్ర జరుగుతోందని తెలిపారు. చంద్రగిరి నుంచి చంద్రబాబు కుప్పం ఎందుకు వెళ్లారో చెప్పాలి అని డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 95శాతం మెజారిటీతో ప్రజలు వైసిపిని గెలిపించారు అని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇటీవ‌ల గుడివాడ‌లో జ‌రిగినట్టు టీడీపీ ఆరోపిస్తున్న కేసినో వ్య‌వ‌హారంపై మంత్రి నాని తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. ``నేను క‌రోనా రోగంతో హైద‌రాబాద్‌లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఉన్నాన‌ని చెప్పినా.. ఈ నాకొ........లు వినిపించు కోవ‌డం లేదు. ఏం చేస్తాం. మా ఖ‌ర్మ‌.వీళ్ల‌కి ప‌నీ పాటా లేదు. అందుకే దానినే ప‌ట్టుకుని ప‌ది రోజులుగా ఊగుతున్నారు. చంద్ర‌బాబు 420.. అందుకే ఇలా ఎదుటోళ్లంద‌రూ 420ల‌ని అనుకుంటాడు. అలా అనుకునేవాళ్ల‌తో ఇలానే మాట్లాడ‌తాం. కొబ్బ‌రి చిప్పులు అమ్ముకుని.. సైకిల్ బెల్లులు దొంగ‌త‌నం చేసే వాడితో నాపై బూతులు తిట్టించాడు. అందుకే బుద్దా వెంక‌న్న‌ను లోప‌లేయించా. 2024లో అధికారంలోకి వ‌స్తే.. న‌న్ను ముక్క‌లు ముక్క‌లుగా న‌రికేస్తారంట‌. మ‌రి రాక‌పోతే.. ఏం చేస్తారు?`` అని నాని ప్ర‌శ్నించారు.

అంతేకాదు.. డీజీపీ పైనా.. మంత్రిగా త‌న‌పైనా వ్యాఖ్య‌లు చేస్తే.. ఊరుకోవాలా? అని ఎదురు నిల‌దీశారు. దేనికైనా హ‌ద్దులు ఉంటాయ‌ని కానీ, చంద్ర‌బాబు చేస్తున్న దారుణాల‌కు హ‌ద్దులు లేకుండా పోయాయ‌ని విమ‌ర్శించారు. విమ‌ర్శించ‌డం.. గుడ్డ కాల్చి మొహాన ప‌డేయ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడ‌ని దుయ్య‌బ‌ట్టారు. కె-క‌న్వెన్ష‌న్‌లో కేసినో లాంటి కార్య‌క‌లాపాలు ఏమీ జ‌ర‌గ‌లేద‌ని.. ఎక్క‌డో జ‌రిగితే.. త‌న‌ను లాగ‌డం ఎందుక‌ని ప్ర‌శ్నించారు. కేసినో త‌ర‌హా అలవాట్లు.. కేబిరో డ్యాన్సులు.. లోకేష్‌కు తెలిసినంత‌గా ఈ రెండు రాష్ట్రాల్లో ఎవ‌రికీ తెలియ‌వ‌ని వ్యాఖ్యానించారు. 2024లోనే కాదు, 2029, 2034 ఎన్నిక‌ల్లో అయినా.. టీడీపీ గెలిచి.. త‌న‌పై క‌క్ష తీర్చుకునేందుకు ఛాన్స్ ఇస్తున్నాన‌ని మంత్రి నాని స‌వాల్ విసిరారు.

మ‌రో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రాష్ట్రంలో కుల, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని చెప్పారు. మంత్రి కొడాలి నానిపై చంద్రబాబు ద్వేషంతో ఉన్నారని తెలిపారు. కొడాలి నాని వైసిపి లో చేరిన నాటి నుంచి చంద్రబాబు కక్ష‌ పెంచుకున్నారు, అందుకే అయిన దానికి, కాని దానికి కూడా మంత్రిని టార్గెట్ చేస్తున్నార‌ని.. అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే.. ఊరుకునేది లేద‌ని నాని వ్యాఖ్యానించారు.

సంక్రాంతికి పోలీసులు వద్దన్నా ప్రజలు బేఖాతరు చేసి కోడిపందేలు జరుపుకున్నారని, గుడివాడలో ఏదో జరిగిందంటున్న టీడీపీ నేత‌లు నిజనిర్ధారణ చేసేందుకు పోలీసులను ఆశ్రయించవచ్చు కదా అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. కొడాలి నానిని చంద్రబాబు మానసికంగా వేదిస్తున్నారని అన్నారు. ఉద్యోగ సంఘాలను చర్చలకు రావాలని కమిటీ తరపున మనస్ఫూర్తిగా మరోసారి ఆహ్వానిస్తున్నామన్నారు. డిమాండ్ ఏదైనా సరే.. ఉద్యోగులు చర్చించేందుకు ముందుకు రావాలని కోరారు.

అంతేకాదు, కేంద్ర మంత్రి మురళీధరన్ పై మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, మనుషులు, ఉద్యోగులపై దాడులు చేసిన ముద్దాయిని కేంద్ర మంత్రి మురళీధరన్ జైలుకు వెళ్లి పరామర్శించడం దారుణమని అన్నారు. ముద్దాయిని పరామర్శించి రాజకీయాలను దిగజార్చారని మంత్రి మండిపడ్డారు. రాష్ట్రాన్ని బీజేపీ నేతలు ఏం చేయాలనుకున్నారని ప్రశ్నించారు. బీజేపీ నేతలు దిగజారి రాజకీయాలు చేస్తున్నారని, రాష్ట్రాన్ని రావణకాష్టం చేసేందుకు యత్నించడం బాధ్యతారాహిత్యమన్నారు.