Begin typing your search above and press return to search.

నీ చెల్లిగా వేడుకుంటున్నా.. కోదాడ ఎమ్మెల్యే తీరుపై పట్టణ ఛైర్ పర్సన్ కన్నీరు

By:  Tupaki Desk   |   16 Aug 2022 4:30 PM GMT
నీ చెల్లిగా వేడుకుంటున్నా.. కోదాడ ఎమ్మెల్యే తీరుపై పట్టణ ఛైర్ పర్సన్ కన్నీరు
X
ఈ మధ్యన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అదే పనిగా ట్వీట్లు చేయటం.. అందులో ఆయనపై తీవ్ర విమర్శలు గుప్పించటం కనిపిస్తోంది. రాజకీయం అన్న తర్వాత ఇలాంటివేమీ తప్పేం కాదు. తప్పు పట్టలేం కూడా.

కానీ.. సొంత పార్టీలోని లుకలుకల్ని మరిచి.. తమ పార్టీ ఎమ్మెల్యే తీరుపై మున్సిపల్ ఛైర్ పర్సన్ కన్నీళ్లు పెట్టటం.. వేధించకన్నా.. నీ చెల్లిగా వేడుకుంటున్నా? అంటూ వాపోయిన తీరు లాంటి వాటిపైనా మంత్రి కేటీఆర్ స్పందించాలి కదా? ఇంటిని సర్దుకోవటం వదిలేసి.. ఊరిని ఉద్దరిస్తామని చెప్పటంలో అర్థం లేదు.
ఇంతకీ అసలేం జరిగిందంటే..

పంద్రాగస్టు నాడు కోదాడ అధికార టీఆర్ఎస్ లో విభేదాలు బయటపడ్డాయి. స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన కుటుంబాన్ని మానసికంగా వేధించటంతో పాటు.. భయభ్రాంతులకుగురి చేస్తున్నారంటూ కోదాడ మున్సిపల్ ఛైర్ పర్సన్ వనపర్తి శిరీష వాపోయారు.

సోమవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలో జెండా ఎగురవేయటానికి ఛైర్ పర్సన్ శిరీష.. పలువురు కౌన్సిలర్లు.. పట్టణ వాసులు హాజరయ్యారు. ఉదయం 8.30 గంటల వేళలో జెండా ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఛైర్ పర్సన్ ను జెండా ఎగురవేయకుండా అడ్డుకున్నారు కమిషనర్.

ఎమ్మెల్యే వచ్చే వరకు ఆగాలంటూ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. కాసేపటికే ఎమ్మెల్యే మున్సిపల్ ఆఫీసు మీదగా వెళ్లారే కానీ.. ఆగలేదు. జెండా కార్యక్రమాన్ని పూర్తి చేయలేదు. ఆ తర్వాత కూడా చాలాసేపటి వరకు ఎమ్మెల్యే రాలేదు. దీంతో.. కమిషనర్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఛైర్ పర్సన్ శిరీష జెండా ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచి లైబ్రరీ ప్రోగ్రాంకు వెళ్లారు.

అక్కడ ఎమ్మెల్యే.. మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్.. కోదాడ ఎంపీపీ అక్కడకు వచ్చారు. వారు లోపలకు వస్తున్న వేళ.. తనను పక్కకు తోసేసి అవమానించారంటూ ఛైర్ పర్సన్ శిరీష ఆరోపించారు. పట్టణ ప్రథమ పౌరురాలి హోదాలో ప్రోగ్రాం కు హాజరైతే మండలానికి చెందిన నేతలు అవమానకరంగా వ్యవహరించారని విమర్శించారు. దీంతో మనస్తాపానికి గురైన శిరీష అక్కడి నుంచి వెళ్లిపోయి.. గాంధీ విగ్రహం ఎదుట మౌనంగా నిరసన వ్యక్తం చేశారు. తాజాగా విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. తనకు జరిగిన అవమానంపై భోరున విలపించారు. ‘అన్నా.. మల్లన్నా నీ సోదరిగా వేడుకుంటున్నా. నా కుటుంబానికి మనశ్శాంతి లేకుండా చేయకన్నా’ అంటూ వాపోయారు. ఈ వ్యవహారంపై మంత్రులు కేటీఆర్.. జగదీశ్ రెడ్డిలు జోక్యం చేసుకోవాలన్నారు. సొంత పార్టీకి చెందిన ఆడబిడ్డ అవమానానికి గురై భోరున విలపిస్తున్న వేళ.. పార్టీని గాటున పెట్టాల్సిన సీఎం.. మంత్రి కేటీఆర్ లు ఎప్పుడు స్పందిస్తారన్న ప్రశ్న ఎదురవుతోంది.