Begin typing your search above and press return to search.

చి 'క్కొచ్చి' పడిందే.. కమ్మేసిన నిప్పు రవ్వ.. వంద కోట్ల ఫైన్

By:  Tupaki Desk   |   19 March 2023 7:00 AM GMT
చి క్కొచ్చి పడిందే.. కమ్మేసిన నిప్పు రవ్వ.. వంద కోట్ల ఫైన్
X
సామాజిక అంశాలు ఎక్కువగా చర్చలోకి వచ్చే కేరళలో ఇటీవల ఓ ఘటన తీవ్ర దుమారం రేపింది. ఆ రాష్ట్రంలోని ఓ నగరంలో రేగిన ‘‘నిప్పు రవ్వ’’ చర్చనీయాంశమైంది. బయటివారికి అప్పటికి ఆ అంశం పెద్దగా ప్రాధాన్యం లేకున్నా.. స్థానికులు మాత్రం తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అటుతిరిగి ఇటుతిరిగి ఆ నిప్పురవ్వ నగరాన్ని కమ్మేసింది. ఇప్పుడది అతి భారీ జరిమానాకు దారితీసింది.

అసలేం జరిగింది...?

చెత్తకుప్పలో చెలరేగిన మంటలతో కేరళలోని కొచ్చి నగరం ఇటీవల గ్యాస్‌ ఛాంబర్‌గా మారింది. ఈ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ డంపింగ్‌ యార్డ్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని ట్రైబ్యునల్ ఇంత సీరియస్ గా తీసుకోవడం ఒక విశేషమైతే, అందులోనూ ఏకంగా రూ.100 కోట్ల జరిమానా విధించడం మరో విశేషం. ఈ ఘటనలో అధికారుల నిర్లక్ష్యానికి గానూ కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు రూ.100 కోట్ల భారీ జరిమానా వేసింది.

నిప్పురవ్వ దావానాలంగా

అది కొచ్చి శివారు బ్రహ్మపురం ప్రాంతం. అక్కడి ఓ భారీ చెత్తకుప్ప వద్ద మార్చి 2 సాయంత్రం మంటలు చెలరేగాయి. అవి వేగంగా వ్యాపించడంతో నేవీ అధికారులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఏకంగా మూడు రోజుల పాటు శ్రమించి మంటలను ఆర్పారు. 30
అగ్నిమాపక యంత్రాలు, 14 భారీ వాటర్‌ పంపులు, నాలుగు హెలికాప్టర్లతో 350 మంది సిబ్బంది, 150 మంది సహాయక సిబ్బంది ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

పొగతో నగరం కమ్ముకుపోయింది

డంపింగ్ యార్డులో ప్రమాదంతో వెలువడిన పొగ కొచ్చి నగరమంతా దట్టంగా కమ్మేసింది. విషపూరిత వాయువుల వ్యాప్తితో గ్యాస్‌ ఛాంబర్‌గా మారిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఫలితంగా కొచ్చిలో రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మార్గదర్శకాలు జారీ చేసింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించింది. మాస్క్‌లు ధరించాలని సూచించింది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడేవారి కోసం మెడికల్‌ క్యాంప్‌లు, ఆక్సిజన్‌ పడకలను అందుబాటు ఉంచింది.

అసలు ఎలా జరిగింది...?

ఇంత ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ టీవీ నిఘా లేకపోవడమే దీనికి కారణం. ఇక డంపింగ్‌ యార్డ్‌ నిర్వహణ బాధ్యతలను బ్రహ్మపురం వేస్ట్‌ ట్రీట్మెంట్‌ ప్లాంట్‌ చూసుకుంటోంది. ఇప్పుడు ఆ ప్లాంట్‌ను మూసేశారు. ఇక ప్రమాదం కొచ్చి లో సంక్షోభ తరహా పరిస్థితులకు దారి తీసినట్లు మీడియా కథనాలు ఇచ్చింది. దీంతో ఎన్‌జీటీ సుమోటో కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. చెత్తకుప్పల వద్ద అగ్నిప్రమాదాలను నిరోధించడంలో కొచ్చి మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు విఫలమైనందుకు రూ.100కోట్లు జరిమానా విధిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పర్యావరణ పరిహారాన్ని నెల రోజుల్లోగా కేరళ చీఫ్‌ సెక్రటరీకి జమ చేయాలని ఎన్‌జీటీ ఛైర్‌పర్సన్‌ జస్టిస్‌ ఆదర్శ్‌ కుమార్‌ గోయల్‌ ఆదేశించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.