Begin typing your search above and press return to search.

సీఎం ఫాంహౌస్ లో ఉంటే ఎలా? ఎవరు అడిగారంటే?

By:  Tupaki Desk   |   5 July 2020 5:00 AM GMT
సీఎం ఫాంహౌస్ లో ఉంటే ఎలా? ఎవరు అడిగారంటే?
X
మాయదారి రోగం పుణ్యమా అని కేసులు నమోదు కావటం మొదలైన తర్వాత నుంచి అంతకంతకూ కేసులు పెరిగిపోతున్న వరకు.. తాజాగా రోజుకు పద్దెనిమిది వందల కేసులు నమోదుకావటం తెలిసిందే. ఇంత జరుగుతున్నా.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ కే పరిమితయ్యారు. ప్రజల మధ్య ఉండాల్సిన అధినేత.. అందుకు భిన్నంగా నాలుగుగోడల మధ్య ఉండిపోవటాన్ని తెలంగాణ బీజేపీ నాయకత్వం తీవ్రంగా తప్పు పడుతోంది.

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని రీతిలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ నేతలు. ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తూనే పలు ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి సాయం అందుతున్నా.. తాము ఇస్తున్న సూచనల్ని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న టీఆర్ ఎస్ సర్కారుపై తీవ్రంగా విరుచుకపడ్డారు.

హైదరాబాద్ మహానగరం ఎప్పుడు పేలుతుందో తెలీదని.. తాము ఇదే విషయాన్ని మొదట్నించి చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రెండుసార్లు కేంద్ర టీంలు నగరానికి వచ్చాయని.. తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి చెప్పినా పెడచెవిన పెట్టినట్లుగా ఆరోపించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ లో ఇంత భారీగా పాజిటివ్ కేసులు ఎందుకు నమోదవుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దారుస్సలాం ఆదేశాల మేరకు ప్రగతిభవన్ లో నిర్ణయాలు తీసుకున్నారని.. అందుకే కేసులు పెరుగుతున్టన్లు పేర్కొన్నారు. ప్రైవేటు ల్యాబ్ లలో చేసే పరీక్షలకు సంబంధించిన గందరగోళం తెలిసిందే. దీనిపై విచారణ చేసిన ప్రభుత్వంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ల్యాబ్ పరీక్షల్లో 71 శాతం పాజిటివ్ రిపోర్టు రావటంపైనా ఆందోళన వ్యక్తం చేశారు.

ఓపక్క కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న వేళ.. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ముఖ్యమంత్రి ఫాంహౌస్ లోనే ఉండటం ఏమిటి? అని ప్రశ్నించారు. తెలంగాణ సర్కారు ఏదో చేస్తుందని ఆశలు పెట్టుకోవద్దన్న కేంద్రమంత్రి.. సర్కారు ఏదో చేస్తుందని ఆశలు పెట్టుకోవద్దని.. హైదరాబాద్ ప్రజలు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకొని సేఫ్ గా ఉండాలని కోరారు. కిషన్ రెడ్డి నోటి నుంచి వచ్చిన ఘాటు వ్యాఖ్యలపై కేసీఆర్ ఎలా రియాక్టు అవుతారో చూడాలి.