కేసీఆర్ పై కిషన్ రెడ్డి ఫైర్.. ఆయన పాలనతో ప్రజలు విసిగిపోయారని కామెంట్

Sun May 29 2022 08:00:01 GMT+0530 (IST)

Kishan Reddy Comments on KCR

రాష్ట్రంలో కేసీఆర్ పాలనపై ప్రజలు విసిగిపోయారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ ముషీరాబాద్లోని ఆర్యవైశ్య భవనంలో  బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఆవిర్భవించిందని.. 8 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ఉద్యోగుల జీతభత్యాలకు ఎలాంటి ఆటంకం లేదని కిషన్రెడ్డి వెల్లడించా రు. కేసీఆర్ నియంతృత్వ పాలనతో రాష్ట్రం దివాలా దిశగా సాగుతోందని ఆయన మండిపడ్డారు.ప్రజలు కచ్చితంగా కేసీఆర్‌కు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆయన వెల్లడించారు. ఈ మార్పును కేసీఆర్ కేటీఆర్ అసదుద్దీన్ అక్బరుద్దీన్ ఒవైసీలు అడ్డుకోలేర న్నారు.

సూర్యుడిపై ఉమ్మేసిన చందంగా టీఆర్ ఎస్ మంత్రులు వ్యవహరిస్తున్నారని కిషన్రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్ను సమస్యలకు కేంద్రంగా ఈ ప్రభుత్వం మార్చిందని విమర్శించారు. ఆదాయ వనరులుగా ఉన్న హైదరాబాద్లోని పేద ప్రజల నివాస ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు.

జీహెచ్ఎంసీ జలమండలి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో పరిపాలన కొనసాగుతోందని ఆయన విమర్శలు గుప్పించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని బీజేపీ నేతలకు సూచించారు.

ఈ సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ భాజపా నాయకుడు శ్యాంసుందర్ గౌడ్ కార్పొరేటర్ రవి చారి తదితరులు పాల్గొన్నారు.

"రాష్ట్రం దివాలా దిశగా సాగుతోంది. హైదరాబాద్లో పేదలు నివసించే ప్రాంతాల్లో రోడ్లు గతుకులమయంగా ఉన్నాయి. హైదరా బాద్ నుంచి 80 శాతం ఆదాయం వస్తున్నా అభివృద్ధి శూన్యం. జీహెచ్ఎంసీ జలమండలి ఉద్యోగులకు జీతాలివ్వలేని దుస్థితి. కేసీఆర్ కుటుంబ పాలనపై ప్రజలు విసిగిపోయారు. 8 ఏళ్ల మోడీ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించింది'' అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.