కేసీఆర్ బీపీ పెంచే మాట చెప్పిన కిషన్ రెడ్డి

Sun Jul 21 2019 11:43:35 GMT+0530 (IST)

తెలుగు రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇప్పటికే బీజేపీ చీఫ్ అమిత్ షా.. రాష్ట్రంలో పార్టీ సభ్యత్వాలను ప్రారంభించి కేడర్లో ఉత్తేజం నింపారు. ఒకవైపు మెంబర్షిప్ డ్రైవ్ వేగంగా చేపడుతూనే.. అధికార పార్టీ నేతల విమర్శలకు అదే స్థాయిలో కమలనాథులు కౌంటర్ అటాక్ చేస్తున్నారు. తమకు ఒక్క శాతం ఓట్లు కూడా లేని త్రిపురలో మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చామని - అదే రీతిలో రాష్ట్రంలోనూ పవర్లోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 2023 టార్గెట్ గా బీజేపీ ముందుకు వెళ్తున్నదని - వచ్చే ఎన్నికల్లో తమదే గెలుపని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేయడమే కాకుండా ఇందుకు ఆయన వ్యక్తం చేసిన లాజిక్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.కేంద్రమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని తొలిసారిగా మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడారు. టీఆర్ ఎస్ పై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉందని - వారు బలంగా మార్పును కోరుకుంటున్నారని చెప్పారు. తాము ఎలాంటి మాస్టర్ ప్లాన్లు అమలు చేయడం లేదని - తెలంగాణ ప్రజలే  మాస్టర్ ప్లాన్ అని తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే 2023లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని - ముందస్తు  ఎన్నికల కోసం తామేమీ తొందరపడటం లేదని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నరు. 2023లో బీజేపీ రావాలని కామన్ పబ్లిక్ కూడా చర్చించుకుంటున్నరు. ఆఫీసర్స్ లో చూసుకున్న - యూత్ ను తీసుకున్న - మహిళలను తీసుకున్న అదే చర్చ. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని అంటున్నారు. ఇది రానున్న రోజుల్లో చాలా పెద్ద ఎత్తున మార్పునకు సంకేతం” అని తెలిపారు. మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో టీఆర్ ఎస్ పార్టీ ‘సారు.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కార్’ అనే నినాదంతో ముందుకు పోయిందని ఆ నినాదం ఏమైందో అందరికీ తెలుసని విమర్శించారు. పదహారు సీట్లలో గెలుస్తామని చెప్పి ఏడు సీట్లలో ఓడిపోయిందని అని అన్నారు.

ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు కేసీఆర్ సారు - కేటీఆర్ సారు.. ఇవన్నేమీ చూడబోరని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘త్రిపురలో ఒకప్పుడు మాకు ఒక్క శాతం ఓట్లు కూడా రాలేదు. అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు మూడింట రెండొంతుల మెజార్టీతో అధికారంలోకి వచ్చాం. దేశంలో చాలా రాష్ట్రంలో ఇలా అధికారంలోకి వచ్చాం. ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు తప్పకుండా మార్పు జరుగుతుంది” అని అన్నారు. రాబోయే రోజుల్లోనూ తెలంగాణలోనూ మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పక్కన మజ్లిస్ను పెట్టుకున్న కేసీఆర్ తమను విమర్శించడం ఏమిటని మండిపడ్డారు. ‘‘ఒక పక్క అక్బరుద్దీన్ ఒవైసీని.. ఇంకోపక్క అసదుద్దీన్ ఒవైసీని కూర్చోబెట్టుకొనే వ్యక్తికి మతం గురించి మాట్లాడే నైతికత ఎక్కడిది? ఆయనకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు ఎక్కడిది?” అని నిలదీశారు.