కాంగ్రెస్ లో కిరణ్ చేరే డేట్ ఫిక్స్ ..?

Fri Jul 06 2018 21:00:01 GMT+0530 (IST)

Kiran Kumar Reddy Ready to Re Entry in Congress Party

రాజకీయాలు మహా చిత్రంగా ఉంటాయి. అప్పటివరకూ పెద్దగా వార్తల్లో కనిపించని వ్యక్తులు ఒక్కసారిగా ప్రముఖులు అయిపోతుంటారు. తెర వెనుక జరిపే మంత్రాంగంతో అత్యున్నత స్థానాల్లోకి చేరుకోవటం అంత తేలికైన విషయం కాదు. కానీ.. ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిదే.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన్ను ఏ మాత్రం ఊహించని తీరుకు భిన్నంగా కాంగ్రెస్ అధినాయకత్వం మాత్రం ఆయన్ను ఎంపిక చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే..కిరణ్ వేస్తున్న అడుగులు.. కదుపుతున్న మంత్రాంగాన్ని దగ్గర నుంచి చూసిన వారు మాత్రం.. ఆయన ఎదుగుదలను ముందే పసిగట్టారని చెప్పాలి.పరిమితమైన వ్యక్తులతో మాత్రమే మాట్లాడే అలవాటున్న కిరణ్.. ముఖ్యమంత్రి అయ్యే వరకూ ఆయన వేసిన అడుగులు ఎప్పటికి ఆసక్తికరమనే చెప్పాలి.

నమ్మి ముఖ్యమంత్రిని చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు సైతం తన తీరుతో షాకిచ్చిన నేతగా కిరణ్ ను చెప్పాలి. రాష్ట్ర విభజనను ఏ మాత్రం ఒప్పుకోని కిరణ్.. తన అసంతృప్తిని బాహాటంగానే బయటపెట్టారు. అయితే.. ఆఖరి బంతి వరకూ ఫలితం తేలదంటూ హైప్ క్రియేట్ చేసి.. అందరిలో ఉత్కంట పెంచారు. చివరకు తుస్ మనిపించటం ద్వారా అప్పటివరకూ తెచ్చుకున్న క్రేజ్ ను పోగొట్టుకున్నారు.

విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. తర్వాత సొంత పార్టీ పెట్టుకున్నా అదేమీ వర్క్ అవుట్ కాలేదు. తర్వాతి కాలంలో కామ్ గా ఉన్న ఆయన.. ఈ మధ్యన ఒక సమావేశంలో సోనియా తన గురించి చేసిన వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఆయన.. వెంటనే అలెర్ట్ కావటం.. అప్పటి నుంచి ఒక క్రమపద్దతిలో కదిపిన పావులతో మళ్లీ కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇచ్చే వరకూ వెళ్లగలిగారు.

మొదట్నించి తాను చేసే పనుల గురించి గుట్టుగా వ్యవహరించే కిరణ్.. తాజాగా కాంగ్రెస్ లోకి రీఎంట్రీ ఇవ్వాలనుకున్న కిరణ్.. మొత్తం ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. ఈ నెల 13న పార్టీలో రీఎంట్రీ ఇచ్చేందుకు రెఢీ అయినట్లుగా సమాచారం.

ఇందులో భాగంగా ఢిల్లీకి వెళ్లనున్న కిరణ్.. తాను పార్టీలో చేరే ముందు కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీని.. తాజా అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అవుతారని.. ఆ తర్వాత పార్టీలో చేరతారని చెబుతున్నారు. ఇప్పటికే కిరణ్ కు రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఓపక్క పార్టీలో చేరేందుకు ఏర్పాట్లన్నీ చేస్తూనే.. మరోవైపు మాత్రం రీఎంట్రీపై తానింతవరకూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదని చెబుతున్నారు. అయినా.. చేసే పని గురించి నల్లారి వారు ఎప్పుడు మాత్రం ఓపెన్ గా చెప్పారు కనుక?