Begin typing your search above and press return to search.

రెచ్చిపోతున్న ఖలిస్తాన్ మద్దతుదారులు

By:  Tupaki Desk   |   21 March 2023 1:47 PM GMT
రెచ్చిపోతున్న ఖలిస్తాన్ మద్దతుదారులు
X
'ఖలిస్తాన్'.. భారత్ లోని ఓ మతవర్గం ప్రత్యేక దేశం, ప్రతిపత్తి హక్కుల కోసం ఎప్పటి నుంచో పోరాడుతోంది. అయితే వీరి తీరు భారత రాజ్యాంగ ఉల్లంఘనల కింద.. అతివాద హింసకు దారితీయడంతో భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఇప్పటికీ పంజాబ్ సహా ఈ మతవర్గం ఉన్న దేశాల్లో వీరి మద్దతుదారులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇటీవల లండన్‌లోని భారత హైకమిషన్ భవనంలో ఖలిస్తాన్ మద్దతుదారులు జాతీయ జెండాను కిందకి లాగి అవమానించడం పెనుదుమారం రేపింది. అది మరిచిపోకముందే తాజాగా అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సులేట్‌పై ఖలిస్తాన్ మద్దతుదారుల భారీ గుంపు దాడి కలకలం రేపింది. ఆ గుంపు భవనం గోడపై 'ఫ్రీ అమృతపాల్' అని స్ప్రే తో రాశారు.

దాడి చేసిన వ్యక్తులు కాన్సులేట్ భవనం యొక్క తలుపులు , కిటికీల అద్దాలను పగులగొట్టారు. ఖలిస్తాన్ జెండాలను కూడా ఊపుతూ కనిపించారు. చెక్క కర్రలు , జెండాల రాడ్లతో తలుపులను హింసాత్మకంగా కొట్టడం కనిపించింది. ఒక వ్యక్తి కత్తితో కిటికీలను పగులగొట్టడం వీడియోల్లో ఉంది.

ఈ ఘటనపై భారత ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అమెరికాపై తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని భారత్ ఒక ప్రకటనలో పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా ఆస్తులను ధ్వంసం చేయడంపై భారతదేశం తన తీవ్ర నిరసనను తెలియజేసింది.

దౌత్యపరమైన ప్రాతినిధ్యాన్ని రక్షించడం , సురక్షించడం అనే ప్రాథమిక బాధ్యతను అమెరికా ప్రభుత్వానికి భారత్ గుర్తు చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా ఇదే తరహాలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్‌కు తన ఆందోళనలను తెలియజేసింది. ఆస్ట్రేలియాలో కూడా ఖలిస్తాన్ మద్దతుదారులు ఆస్ట్రేలియన్ పార్లమెంట్ వెలుపల గుమిగూడి అమృతపాల్ కోసం పోలీసుల వేటకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

కాగా పంజాబ్ లో ఇదే ఖలిస్తాన్ ఉద్యమాన్ని లేవనెత్తుతున్న 'అమృత్ పాల్' కోసం భారత సైన్యం, పోలీసులు వేట ప్రారంభించారు. తృటిలో తప్పించుకున్న అతడిని వెతుకుతున్నారు. విభజన రాజకీయాలు చేస్తూ విద్వేశాన్ని రగిలిస్తున్న అమృత్ పాల్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఖలిస్తాన్ నాయకుడికి మద్దతుగా విదేశాల్లో ఆ మద్దతురాలు ఇలా హింసాత్మక చర్యలు చేపడుతూ భారత్ కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.