Begin typing your search above and press return to search.

మార్గదర్శి ఎపిసోడ్ లో కీలక మలుపు.. ఇప్పుడేం జరగనుంది?

By:  Tupaki Desk   |   31 March 2023 9:37 AM GMT
మార్గదర్శి ఎపిసోడ్ లో కీలక మలుపు.. ఇప్పుడేం జరగనుంది?
X
ఒకసారి టార్గెట్ ఫిక్సు అయితే ఇక అంతే. అనుకున్నది అనుకున్నట్లుగా పని పూర్తి కావాల్సిందే. అంతకు మించి మరో మాటలకు అలవాటు లేని తీరు ఏపీలోని జగన్ సర్కారులో కనిపిస్తుందన్న మాట తరచూ వినిపిస్తుంటుంది. ఇందుకు తగ్గట్లే గడిచిన నాలుగేళ్ల జగన్ పాలనలో ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్టు చోటు చేసుకున్న విషయాన్ని తమ వాదనకు నిదర్శనంగా చూపే వారు కనిపిస్తారు. విపక్ష తెలుగుదేశంలో కొందరు ముఖ్యనేతలు మినహా.. మిగిలిన వారందరిని వివిద కేసుల్లో అరెస్టులు చేయటం.. రిమాండ్ కు పంపటం.. శ్రీక్రిష్ణ జన్మస్థానం ఎలా ఉంటుందన్న పరిచయం చేసిన క్రెడిట్ మాత్రం జగన్ సర్కారుకే అన్న మాట పలువురి నోట వస్తూ ఉంటుంది.

తాజాగా మార్గదర్శి చిట్ ఫండ్ విషయంలోనూ ఇదే తీరును ప్రదర్శిస్తున్నారు. అందుకు తగ్గట్లే వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అంటే అవునన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. వైఎస్ కుటుంబానికి.. రామోజీకి మధ్యనున్న పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగునాట చిన్నపిల్లాడితో సహా అందరికి అవగాహన ఉన్న ముచ్చట ఇది. అలాంటిది గడిచిన నాలుగేళ్లలో లేనింత గట్టిగా.. మార్గదర్శి ఎపిసోడ్ లో జగన్ ప్రభుత్వం చాలా పట్టుదలతో ఉన్నట్లుగా చెబుతున్నారు.

ఇందుకు తగ్గట్లే గడిచిన కొద్ది రోజులుగా భారీ ఎత్తున ప్లాన్ చేసి మరీ.. ఒక వ్యూహాంలో భాగంగా వరుస పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. మార్గదర్శి ప్రధాన కార్యాలయం మొదలు.. వివిధ బ్రాంచీల్లో తనిఖీలు నిర్వహించటమే కాదు.. పలువురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్ల ఇళ్లల్లో సీఐడీ సోదాలు నిర్వహించటం సంచలనంగా మారింది. తాజాగా.. మార్గదర్శికి చార్టెడ్ అకౌంటెంట్ గా వ్యవహరించే బ్రహ్మయ్య అండ్ కో మీదా ఫోకస్ చేయటం.. అందులో దాదాపు 27గంటల పాటు సోదాలు నిర్వహించటంతో పాటు.. సంస్థ భాగస్వామ్యుల్లో ఒకరైన 75 ఏళ్ల పెద్ద మనిషికి తన జీవితంలో ఎప్పుడు ఎదురుకాని చేదు అనుభవం ఎదురు కావటం.. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవటం తెలిసిందే.

ఇదిలాఉంటే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించి మార్గదర్శి చిట్ పండ్ మోసంలో భాగంగా.. సంస్థకు ఆడిటర్లుగా వ్యవహరించే బ్రహ్మయ్య అండ్ కోలో అధికారిక భాగస్వామిగా వ్యవహరిస్తున్న కె. శ్రవణ్ ను గురువారం అరెస్టు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ అక్రమాలు. మోసాలు.. నిధుల మళ్లింపు కేసులో ఆయన్ను సీఐడీ అరెస్టు చేసింది. ఆయన్ను విజయవాడ మూడో మెట్రో పాలిటన్ కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పర్చారు. ఆయనకు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

మార్గదర్శికి సంబంధించిన వందల కోట్లకు డిపాజిట్ల వివరాల్నిశ్రవణ్ వెల్లడించలేదని.. నిబంధనలకు విరుద్ధంగా ఆడిటింగ్ జరిగినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని శ్రవణ్ కూడా అంగీకరించినట్లుగాచెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో రామోజీ కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో ముఖ్యులు ఒకరు సీఐడీ విచారణను ఎదుర్కోవటమేకాదు.. అరెస్టు ముప్పు ఎదుర్కొంటున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి. మరేం జరుగుతుందో చూడాలి.