ట్వీట్ చూసి ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన కీలక అధికారి

Wed Aug 10 2022 10:45:09 GMT+0530 (India Standard Time)

Key official who came from Delhi to Hyderabad

ఒక ట్వీట్ ప్రభుత్వాన్ని పడగొట్టే పరిస్థితి. ప్రపంచ గమనాన్ని సోషల్ మీడియా మార్చేసిన విషయం తెలిసిందే. ప్రజలు తాము ఎదుర్కొనే సమస్యల్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేయటం ద్వారా ప్రభుత్వాలకు అలారమ్ మోగిస్తున్నారు.దీంతో.. సోషల్ మీడియాలో పోస్టు అయ్యే సమస్యల మీద పలు విభాగాలకు సంబంధించిన అధికారులు ప్రత్యేకశ్రద్ధను చూపిస్తున్నారు. తాజాగా ఒక కీలక అధికారి తన వరకు వచ్చిన ఒక సమస్య సంగతి చూసేందుకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చిన అరుదైన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది.

హైదరాబాద్ శివారులోని జాతీయ రహదారి 65 అధ్వానంగా ఉందంటూ ఒక నెటిజన్ జాతీయ రహదారుల సంస్థకు చెందిన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ ట్వీట్ ను చూసిన వెంటనే సంస్థ ఛైర్ పర్సనర్ అల్కా ఉపాధ్యాయ ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు రావటం సంచలనంగా మారింది. అంతేకాదు.. ట్వీట్ లో పేర్కొన్న రోడ్డు వద్దకు వెళ్లి.. ఆ రహదారి ఎవరి నియంత్రణలో ఉందన్న విషయాన్ని ఆరా తీశారు. దీంతో.. జాతీయ రహదారుల అధికారులు.. సదరు రోడ్డు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందన్న విషయాన్ని తెలియజేశారు.

నిజానికి కేంద్రం నియంత్రణలో లేని రోడ్లు అయినప్పటికీ..  టోల్ రహదారి మొదలయ్యే మల్కాపూర్ నుంచి సూర్యాపేట వరకు రహదారి నిర్వహణను ప్రత్యేకంగా పర్యవేక్షించటం గమనార్హం.

ట్వీట్ నేపథ్యంలోనే తాను హైదరాబాద్ వచ్చిన విషయాన్ని అల్కా ఉపాధ్యాయ చెప్పినట్లుగా ఒక అధికారి చెప్పినట్లుగా ఒక మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. ఏమైనా.. ఒక ట్వీట్ తో ఢిల్లీ నుంచి ఒక కీలక అధికారి హైదరాబాద్ కు వచ్చి.. అందులోని అంశాల మీద సమీక్ష జరిపిన తీరు చూస్తే.. సోషల్ మీడియా ఎంత పవర్ ఫుల్ వెపన్ అన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.