ఎంపీ రఘురామ ఎపిసోడ్ లో కీలక పరిణామాలు

Sat Jan 29 2022 20:00:01 GMT+0530 (IST)

Key developments in the MP Raghurama episode

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ కు సంబంధించి కొంతకాలం స్తబ్దుగా ఉండటం.. దీనిపై ఏపీ అధికారపక్ష నేతలు తరచూ లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లాకు విన్నవించుకోవటం తెలిసిందే. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటూ.. వేటు వేయాలని కోరిన అంశంపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం రాని వైనం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఈ అంశంపై కీలక పరిణామం చోటు చేసుకుంది.తాజాగా లోక్ సభ స్పీకర్ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ పై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. వైసీపీ చీఫ్ విప్ మార్గాని భరత్ ఇచ్చిన కంప్లైంట్ ను లోక్ సభ స్పీకర్ ప్రివిలేజ్ కమిటీకి పంపారు. అంతేకాదు.. ఈ అనర్హత పిటిషన్ పై త్వరితగతిన విచారణ జరిపి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీని ఆదేశించారు.

ఫిబ్రవరి 3న ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఇందులో.. రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్ అంశం చర్చకు వస్తుందని చెబుతున్నారు. ఇంతకాలం అనర్హత పిటిషన్ పై త్వరగా నిర్ణయంలో తీసుకోవాలని కోరినప్పటికీ అందుకు తగ్గట్లు పరిణామాలు చోటు చేసుకోకపోవటం తెలిసిందే. అందుకు భిన్నంగా తాజాగా మాత్రం.. వెంటనే నివేదిక కోరటం చూస్తే.. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న రఘురామకృష్ణరాజు  పిటిషన్  ఎపిసోడ్ ముగింపునకు వచ్చిందన్న అభిప్రాయం కలుగక మానదు.

మరోవైపు వైసీపీ రెబల్ ఎంపీ తాజాగా రియాక్టు అయ్యారు. అనర్హత వేటుపై ఫిబ్రవరి 11 వరకు తాను ముఖ్యమంత్రి జగన్ కు టైమిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పటివరకు ఏం చేస్తారో చేసుకోవాలన్నారు. రాజధాని విషయంలో ఏపీ ప్రభుత్వం మోసం చేసిందన్న ఆయన.. ప్రభుత్వంపై రైతులు కేసులు పెట్టాలని సూచన చేశారు. మూడు రాజధానులు తెచ్చే హక్కు వైసీపీ ప్రభుత్వానికి లేదన్న ఆయన.. కోర్టులో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. చూస్తుంటే.. ఫిబ్రవరిలో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నట్లుగా చెప్పక తప్పదు