Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు ఆహ్వానం.. ఇరకాటంలో బీజేపీ నాయకులు

By:  Tupaki Desk   |   26 Feb 2020 5:30 PM GMT
కేసీఆర్ కు ఆహ్వానం.. ఇరకాటంలో బీజేపీ నాయకులు
X
తెలంగాణలో బీజేపీ నాయకుల పరిస్థితి చిత్రంగా ఉంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడుతుంటే మాత్రం అధిష్టానం, కేంద్ర నాయకుల తీరుతో స్థానిక నాయకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక నాయకులు ఒకలా వ్యవహరిస్తుంటే ఢిల్లీ పెద్దల వ్యవహారం, కేంద్ర మంత్రుల తీరుతో ఇరకాటంలో పడుతున్నారు. కేంద్ర పెద్దలు టీఆర్ఎస్ తో దోస్తీ చేస్తుండగా తెలంగాణలోని రాష్ట్ర నాయకులు అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే కేంద్రం ఒకలా.. తాము మరోలా చేస్తుండడంతో పార్టీ శ్రేణులు గందరగోళం పడుతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ నాయకులు పరేషాన్ అవుతున్నారు.


మొదటి నుంచి ఇదే తీరు కొనసాగుతోంది. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ లో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ తో బీజేపీ పెద్దలు సానుకూల వైఖరి ప్రదర్శిస్తున్నారు. నరేంద్రమోదీ పాలన తొలి హయాంలో కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి కేసీఆర్ పాలన భేష్, ఆదర్శ పాలన, తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి ఆదర్శమని ప్రకటించారు. అప్పుడు తెలంగాణ లోని స్థానిక నాయకులు ఏమీ చేయాలో పాలుపోని పరిస్థితి.

2019 ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో అనూహ్యంగా 4 ఎంపీ స్థానాలు కైవసం చేసుకుని అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అనేంతలా బీజేపీ ఎదిగింది. అయితే ఇప్పుడు కూడా గత పరిస్థితే ఎదురైంది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా తాము పోరాడుతుంటే.. జాతీయ నాయకులు తమ ఆవేశంపై నీళ్లు చల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకం గా నిర్ణయం తీసుకుని ఏకంగా మంత్రిమండలి తీర్మానం కూడా చేశారు. త్వరలోనే అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని ప్రకటించారు. దీన్ని ఆసరాగా చేసుకుని టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా వ్యూహం సిద్ధం చేసుకుని పోరాడుదామని తెలంగాణ నాయకులు నిర్ణయించుకుంటున్న సమయం లో ఇప్పుడు మళ్లీ నిరాశకు గురయ్యేలా కేంద్ర పెద్దలు వ్యవహరించారు. తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు మళ్లీ ఆందోళనలో పడ్డారు. రాష్ట్రంలో తాము కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేద్దామని అనుకునే లోపే కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం వారికి విఘాతంగా మారింది. అదే కేసీఆర్ కు ట్రంప్ తో సమావేశం ఆహ్వానం.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గౌరవార్ధం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రత్యేకంగా ఆహ్వానం పంపడంపై తెలంగాణ బీజేపీ నాయకులకు మింగుడు పడడం లేదు. దేశంలో 28 మంది ముఖ్య మంత్రులు ఉండగా కేవలం 8 మంది ముఖ్య మంత్రులకు విందు ఆహ్వానించగా వారిలో కేసీఆర్ ఉండడం వారికి నచ్చలేదు. బీజేపీ పాలిత ముఖ్యమంత్రులకు కొందరికి ఆహ్వానించకపోగా తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించడంపై బీజేపీ నేతలు ఆహ్వానించడం లేదు. ఇక్కడ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుంటే రాష్ట్రపతి భవన్‌ కేసీఆర్‌కు ఆహ్వానం పంపడంతో తాము కేసీఆర్‌పై చేసే పోరాటం వృథా ప్రయాస అని ఆవేదన చెందుతుననారు.

సీఎం కేసీఆర్‌ బీజేపీకి స్వపక్షమో.. విపక్షమో తెలియని పరిస్థితి అని స్థానిక కమలం పార్టీ నాయకులు ఆందోళన చెందుతున్నారు. కేసీఆర్‌ పై ఇటీవల బీజేపీ నేతలు విమర్శల దాడిని పెంచుతుండగా ఆ సమయంలో ట్రంప్ తో విందుకు కేసీఆర్ ను ఆహ్వానించడంపై గుర్రు ఉన్నారని తెలుస్తోంది. గతంలోనూ ఇంతే.. కేంద్రం కూడా తమకు సహకరిస్తే రాష్ట్రంలో పార్టీ సత్తా చాటే అవకాశం ఉందని బీజేపీ నాయకులు పేర్కొంటున్నారు. అలా కాకుండా కేంద్ర పెద్దలు కేసీఆర్ తో సానుకూల వైఖరి ప్రదర్శించడం సరికాదని చెబుతున్నారు.