క్రికెట్ ఎన్నికల్లోకి కవిత.. అజార్ స్పందన ఇదీ

Thu Jun 17 2021 21:09:11 GMT+0530 (IST)

Kavitha into Hyderabad cricket

కుంభకోణాలు అవినీతి ఆరోపణలతో హైదరాబాద్ క్రికెట్ మసకబారిందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ మధ్య బీసీసీఐ కూడా హైదరాబాద్ లో ఐపీఎల్ పెట్టకపోవడానికి హెచ్.సీ.ఏ విధానాలే కారణమని ఆరోపణలు వచ్చాయి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడైన తర్వాత కూడా టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్ ఏలాంటి మార్పు తీసుకురాలేదు. పైగా మరింతగా హైదరాబాద్ క్రికెట్ ప్రతిష్ట దిగజారింది. అసోసియేషన్ కు తీవ్ర నష్టం జరిగింది.తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ హెచ్.సీ.ఏ అధ్యక్షుడు అజారుద్దీన్ కు నోటీసుల వ్యవహారంలో చర్చనీయాంశమైంది. అజారుద్దీన్ ను అధ్యక్ష పదవి లోంచి తీసేసేందుకు హెచ్.సీ.ఏ నోటీసులు ఇవ్వడం సంచలనమైంది.

ఈ క్రమంలోనే అజారుద్దీన్ స్పందించారు. తనపై అనర్హత వేటు వేసే హక్కు అపెక్స్ కౌన్సిల్ కు లేదని ఆయన తెలిపారు. అంబుడ్స్ మెన్ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. హెచ్.సీ.ఏ కార్యవర్గాన్ని రద్దు చేసే అధికారం అంబుడ్స్ మెన్ కు మాత్రమే ఉందన్నారు.

కార్యవర్గాన్ని రద్దు చేసి హెచ్.సీ.ఏకు మళ్లీ ఎన్నిక నిర్వహించాలనుకుంటే తాను సిద్ధమని అజారుద్దీన్ వ్యాఖ్యానించారు. కోట్ల రూపాయల నిధులు వస్తున్నా ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఉప్పల్ స్టేడియం తప్ప మరో గ్రౌండ్ కూడా ఎందుకు అభివృద్ధి చేయలేదన్నారు. అవినీతికి అడ్డుపడుతున్నందుకే తనపై తిరుగుబాటు అని వ్యాఖ్యానించారు.

ఇక హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ తనయురాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అడుగుపెడుతున్నారన్న వార్తలపై అజార్ స్పందించారు. ఎవరైనా పోటీ చేయవచ్చని.. తప్పేం లేదని అన్నారు. కవిత పోటీ విషయం తనకు తెలియదని వ్యాఖ్యానించారు. కవిత చేసిన వ్యాఖ్యలు తాను వినలేదన్నారు.