టీడీపీలో గ్రీష్మ ప్రతాపం : రాజాం అభ్యర్ధిగా ఆమె...?

Thu May 12 2022 17:00:01 GMT+0530 (IST)

Kavali Greeshma in TDP

టీడీపీలో మాటలకు చేతలకు మధ్య ఎపుడూ తేడా ఉంటుందని అంటారు. కానీ ఈసారి మాత్రం అలా కాదు నో మొహమాటాలు అంటూ అధినాయకత్వం గట్టిగానే చెబుతోంది. ఈ నేపధ్యంలో సీనియర్లను త్యాగాలు చేయమని చెబుతూనే మరో వైపు జూనియర్లకు భారీ ఎత్తున పార్టీలో ప్రోత్సాహం ఇస్తున్నారు.ఈ క్రమంలోనే విజయనగరం జిల్లాలో భాగమైన రాజాం అసెంబ్లీ స్థానంలో కీలక నాయకురాలిగా ఉన్న కావలి గ్రీష్మను పార్టీ అధికార ప్రతినిధిగా చంద్రబాబు నియమించారు. ఉన్నత విద్యావంతురాలు అయిన గ్రీష్మ మంచి మాటకారి. అలాగే ఫైర్ బ్రాండ్ కూడా ఇప్పటిదాకా చూస్తే ఉత్తరాంధ్రాలో మాజీ ఎమ్మెల్యే అనిత ఒక్కరే వైసీపీని గట్టిగా అటాక్ చేస్తూ వస్తున్నారు.

ఇపుడు గ్రీష్మ కూడా తోడు అవుతారు అని అంటున్నారు. ఆమె మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి కుమార్తె. 2017లో టీడీపీలో చేరిన ఆమెకు 2019 ఎన్నికల్లో టికెట్ దక్కుతుందని అంతా భావించారు. కానీ నాడు ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కళా వెంకటరావు మద్దతు తో టీడీపీలోకి వచ్చిన మాజీ మంత్రి కోండ్రు మురళీమోహన్ కి టికెట్ ఇచ్చారు. ఆయన పరాజయం పాలు అయ్యారు.

ఇపుడు రాజాం కి మురళీమోహనరావు ఇంచార్జిగా ఉంటున్నారు. అయితే ఆయనకు టికెట్ దక్కపోవచ్చు అని చాలా కాలంగా వినిపిస్తోంది. ఇక గ్రీష్మ రాజాంలో యాక్టివ్ గా ఉన్నారు. ఆమెకు టికెట్ ఇవ్వాలని మాజీ స్పీకర్ కూడా కోరుతూ వస్తున్నారు. దీంతో అధినాయకత్వం సుముఖంగా ఉందనే అంటున్నారు.

అందులో భాగంగానే యంగ్ బ్లడ్ ని పార్టీలో కీలక స్థానానల్లో ఉంచాలని గ్రీష్మను అధికార ప్రతినిధిగా నియమించారు. ఇక రాజాం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆమె పోటీకి రెడీ అయిపోవడమే అంటున్నారు.  మరో వైపు చూస్తే గత రెండు సార్లు రాజాం నుంచి కంబాల జోగులు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆయన హ్యాట్రిక్ కొడతారా లేక గ్రీష్మ గెలిచి అసెంబ్లీకి వస్తుందా అన్నది చూడాలి. ఏది ఏమైనా గ్రీష్మ ఇప్పటికే నియోజకవర్గ నాయకురాలిగా సత్తా చాటుతున్నారు. ఇపుడు కొత్త పదవితో నేరుగానే వైసీపీ సర్కార్ ని ఢీ కొడతారు అని అంటున్నారు.